తెలంగాణ

telangana

ETV Bharat / business

షేర్లలో మదుపు.. ఈ పన్ను నిబంధనలు తెలుసా? - దేశ ఆర్థిక వ్యవస్థ

స్టాక్‌ మార్కెట్‌.. ఇప్పుడున్న పెట్టుబడి మార్గాల్లో ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. చిన్న, పెద్ద మదుపరులందరూ ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. షేర్లలో పెట్టుబడి లావాదేవీలు నిర్వహించినప్పుడు మూలధన లాభం లేదా నష్టం రావడం సర్వసాధారణం.. మరి, ఈ లావాదేవీలన్నీ ఆదాయపు పన్ను రిటర్నులలో చూపించాలా? ఈ లాభనష్టాలను ఎలా వర్గీకరిస్తారు.. పన్ను భారం ఎలా ఉంటుంది? తెలుసుకుందాం..

Invest in stocks .. FIRST Learn the tax terms.
షేర్లలో మదుపు.. ఈ పన్ను నిబంధనలు తెలుసా?

By

Published : Mar 12, 2021, 10:28 AM IST

Updated : Mar 12, 2021, 1:49 PM IST

షేర్లలో మదుపు చేసినప్పుడు.. ఇతర వ్యాపారాల్లాంటివి ఏమీ లేకపోయినా ప్రతి వ్యక్తీ తప్పనిసరిగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం ఉంటుంది. పెట్టుబడి పెట్టి, మూలధన లాభం లేదా నష్టం వచ్చినప్పుడు దాన్ని కచ్చితంగా చూపించాలి. వీటిని మొత్తం ఆదాయంలో భాగంగానే పరిగణించి, రిటర్నులు సమర్పించాలి. ఏడాదిలోపు మదుపు చేసినప్పుడు వచ్చే స్వల్పకాలిక మూలధన లాభం, ఏడాదికి మించి పెట్టుబడిని కొనసాగించినప్పుడు వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలను ఎలా నివేదించాలి.. దానికి ఎంత పన్ను చెల్లించాలో చూద్దాం..

ఎఫ్‌అండ్‌ఓలో..

ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌అండ్‌ఓ) మార్కెట్లో రోజువారీ లావాదేవీలు నిర్వహించేవారు కొంతమంది ఈ విధానాన్ని ఎంచుకుంటారు. ఎఫ్‌అండ్‌ఓ ద్వారా నిర్వహించిన లావాదేవీల్లో సంక్రమించిన లాభం లేదా నష్టం వచ్చిందనుకోండి. వాటిని స్వల్పకాలిక మూలధన లాభం/నష్టంగా పరిగణిస్తారు. ఒక ఆర్థిక సంవత్సరంలో మీకు వచ్చిన లాభనష్టాలను మీ ఇతర ఆదాయాలతో కలిపి రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా నష్టం వచ్చినప్పుడు గడువు తేదీలోగా కచ్చితంగా రిటర్నులు సమర్పించాలి. లేకపోతే తదుపరి సంవత్సరాలకు ఈ నష్టాలను బదలాయించడం సాధ్యం కాదు. స్టాక్‌ మార్కెట్‌లో ఆర్జించిన స్వల్పకాలిక లాభాలపై సెక్షన్‌ 111ఏ ప్రకారం 15శాతం పన్ను చెల్లించాలి. ఒకవేళ మీకు లభించిన స్వల్పకాలిక లాభం, మిగిలిన ఆదాయం కలిపినప్పుడు.. ఆదాయపు పన్ను పరిమితి లోపు ఉంటే.. ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు.

దీర్ఘకాలిక లాభం అంటే..

ప్రస్తుత ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం.. స్టాక్‌ ఎక్స్ఛేంజీ ద్వారా నిర్వహించిన లావాదేవీల్లో దీర్ఘకాలిక లాభం గడించినప్పుడు సెక్షన్‌ 112ఏ ప్రకారం 10శాతం ప్రత్యేక పన్ను విధిస్తారు. అయితే, ఒక ఆర్థిక సంవత్సరంలో దీర్ఘకాలిక మూలధన లాభం రూ.లక్షకు మించినప్పుడు.. ఆ పై మొత్తానికి ఈ పన్ను వర్తిస్తుంది. షేర్లను కొని ఏడాదిపాటు అట్టిపెట్టుకొని, ఆ తర్వాత అమ్మినప్పుడు దాన్ని దీర్ఘకాలిక లావాదేవీగా పరిగణిస్తారు. తద్వారా వచ్చిన లాభ నష్టాలను దీర్ఘకాలిక మూలధన లాభం/నష్టం అని పేర్కొంటారు.

దీర్ఘకాలిక లాభాన్ని గణించేటప్పుడు ఈ కింది నిబంధనలను పాటించాలి..

  • లావాదేవీలను స్టాక్‌ ఎక్స్ఛేంజీ ద్వారా నిర్వహించి ఉండాలి.
  • అమ్మిన షేర్లను కనీసం ఏడాదిపాటు కొనసాగించాలి.
  • లావాదేవీలపై ఎస్‌టీటీ (సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌) చెల్లించాలి.

పై నిబంధనలకు లోబడి.. షేర్ల ద్వారా ఆర్జించిన దీర్ఘకాలిక లాభంపై 10శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

సర్దుబాటు చేసుకోవచ్చా?

దీర్ఘకాలిక లాభాన్ని.. దీర్ఘకాలిక నష్టంతో సర్దుబాటు చేసుకునే అవకాశం చట్టం కల్పిస్తోంది. అయితే, దీర్ఘకాలిక నష్టాలను స్వల్పకాలిక లాభాలతో సర్దుబాటు చేసుకోవడం కుదరదు. కానీ, స్వల్పకాలిక నష్టాన్ని దీర్ఘకాలిక లాభంతోనూ, స్వల్పకాలిక లాభంతోనూ సర్దుబాటు చేసుకునే వీలుంటుంది. అంతేకాకుండా మూలధన నష్టాలను ఇతర ఆదాయాలతో సర్దుబాటు చేయడం సాధ్యం కాదు.

ఐపీఓలో షేర్లు వస్తే..

తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)కి దరఖాస్తు చేసినప్పుడు వచ్చిన షేర్లను ఏడాదిపాటు కొనసాగించి అమ్మేస్తే అప్పుడు దీర్ఘకాలిక లాభం/నష్టంగా పరిగణిస్తారు. ఈలోపు అమ్మితే స్వల్పకాలిక లాభం/నష్టంగానే చూపించాలి. పైన పేర్కొన్న పన్ను నిబంధనలే ఇక్కడా వర్తిస్తాయి. మీ ఆదాయం మూలధన లాభంతో కలిపిన తర్వాత రూ.2,50,000వరకూ ఉంటే.. ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. కానీ, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం ఉత్తమం.

జి. సాంబశివరావు

ఏ ఐటీఆర్‌ సమర్పించాలి?

ఉద్యోగం ద్వారా ఆదాయం ఉన్నప్పటికీ.. షేర్లలో లావాదేవీలు నిర్వహించినప్పుడు లాభం లేదా నష్టం వస్తే ఆ విషయాన్ని కచ్చితంగా రిటర్నులలో చూపించాలి. కేవలం వేతనం ద్వారా ఆదాయం ఉంటే.. ఐటీఆర్‌ 1 సరిపోతుంది. వ్యాపారం, వృత్తి ద్వారా ఆదాయం లేకుండా మిగిలిన ఆదాయాలు ఉన్నప్పుడు ఐటీఆర్‌ 2ను ఎంచుకోవాలి. కాబట్టి, షేర్లలో లావాదేవీలు నిర్వహించే వారంతా.. కచ్చితంగా ఐటీఆర్‌ 2లోనే తమ రిటర్నులు సమర్పించాలి.

ఫండ్లలో పెట్టుబడి..

మ్యూచువల్‌ ఫండ్లలోని ఈక్విటీ ఆధారిత పెట్టుబడులకూ షేర్లకు వర్తించిన నిబంధనలే వర్తిస్తాయి. డెట్‌ ఫండ్లలో మాత్రం పెట్టుబడిని మూడేళ్లకు మించి కొనసాగిస్తేనే దీర్ఘకాలిక ఆస్తిగా పరిగణిస్తారు. అంతలోపు అమ్మితే స్వల్పకాలిక పెట్టుబడిగా పేర్కొంటారు. ఈ లావాదేవీలకు నిబంధనల ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

మ్యూచువల్‌ ఫండ్లలో స్వల్పకాలిక లావాదేవీలపై పన్ను ఎలా ఉంటుందంటే..

మ్యూచువల్​ ఫండ్లలో పన్ను వివరాలు

- జి. సాంబశివరావు

ఇదీ చూడండి: చదువుల ఖర్చులు తట్టుకునేలా.. సిద్ధంగా ఉండాల్సిందే!

Last Updated : Mar 12, 2021, 1:49 PM IST

ABOUT THE AUTHOR

...view details