తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా దెబ్బతో భారీగా పెరిగిన ఇంటర్నెట్ వినియోగదారులు - jio network

దేశంలో కరోనా విస్తరణ నేపథ్యంలో ఆంక్షలు అమలవుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. వినోదాన్ని అందించే అన్ని దారులు మూసుకుపోయాయి. ఫలితంగా ఇంటర్నెట్​ వినియోగదారులు భారీగా పెరిగిపోయాయి. అయితే డిమాండ్‌కు తగిన విధంగా సేవలు అందించేందుకు భారతీ ఎయిర్‌టెల్‌, వొడాపోన్‌ ఐడియా, రిలయెన్స్‌ జియో వద్ద ఆ స్థాయిలో మౌలిక సదుపాయాలు లేవని టెలికాం రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Internet user increased cause of Coronavirus outbreak
ఇంటర్నెట్​నూ వదలని కరోనా.. పెరిగిన వినియోగదారులు

By

Published : Mar 20, 2020, 7:19 PM IST

కరోనా వైరస్‌ వ్యాప్తితో దేశవ్యాప్తంగా చాలా మంది ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పని చేస్తున్నారు. దీనికి తోడు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి. సినిమా థియేటర్లు, మాల్స్‌ మూతపడ్డాయి. వినోదం కోసం ప్రజలు ఇంటర్నెట్‌పై ఆధారపడుతున్నారు.

సదుపాయాల్లేవ్​!

దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ వినియోగం పెరిగింది. భారతదేశంలో 22.26 మిలియన్ల బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారులు ఉన్నారు. అకస్మాత్తుగా దేశంలో డేటా వినియోగం పెరిగిందని, డిమాండ్‌కు తగిన విధంగా సేవలు అందించేందుకు భారతీ ఎయిర్‌టెల్‌, వొడాపోన్‌ ఐడియా, రిలయెన్స్‌ జియో వద్ద ఆ స్థాయిలో మౌలిక సదుపాయాలు లేవని టెలికాం రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. హెచ్‌డీ వీడియోలు, వీడియో కాల్స్‌కు అంతరాయం కలగవచ్చని భావిస్తున్నారు.

వెంటాడుతున్న కొరత

ఇప్పటికే బ్రాడ్‌బ్యాండ్‌ రంగంలో స్పెక్ట్రం కొరత, తక్కువ ఫైబరైజేషన్‌, పేలవమైన వైర్లతో మౌలిక సదుపాయాల కొరతను ఎదుర్కొంటున్నాయి. డేటా వినియోగం అకస్మాత్తుగా పెరగినందున మౌలిక సదుపాయాలకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని అలా జరగడానికి ముందే తాజాగా వైఫై హాట్‌స్పాట్‌ల ఏర్పాటు, ఫైబర్‌ కేబుల్‌ విస్తరణ చేయడానికి కావాల్సిన స్పెక్ట్రం కేటాయించడానికి ప్రభుత్వానికి ఇదే సరైన సమయమని టెలికాం సంస్థలు ఆశిస్తున్నాయి.

గణాంకాలు..

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం సగటు నెలవారీ వైర్‌లెస్‌ డేటా వినియోగం 10.37జీబీ ఉందని పేర్కొంది. కరోనా వైరస్‌ వ్యాప్తి, ప్రజలు ఇళ్ల నుంచే పని చేస్తూ ఉంటే సగటు వినియోగదారుడు నెలవారీ డేటా వినియోగం వచ్చే రెండు త్రైమాసికాల్లో 15 శాతం పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇళ్లలో బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగం పెరగి డిమాండ్‌కు తగిన వనరులు పరిశ్రమకు లేనందున టెలికాం సేవల నాణ్యత దెబ్బతినే అవకాశముందని భావిస్తున్నారు. అయితే డిమాండ్‌కు తగిన విధంగా సేవలు అందించగలమనే ధీమాను టెలికాం సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి. మా గృహ, వాణిజ్య వినియోగదారులకు డిమాండ్‌కు తగిన విధంగా బ్యాండ్‌విడ్త్‌ను అందించగల సామర్థ్యం తమకు ఉందని భారతీ ఎయిర్‌టెల్‌ ప్రకటించింది.

ఇంటర్నెట్​ ట్రాఫిక్​..

ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావంతో ఇంటర్నెట్‌ ట్రాఫిక్‌ పెరిగింది. దక్షిణ కొరియాలో 40శాతం, ఇటలీలో 30శాతం, అమెరికాలోని సియాటెల్‌లో 30శాతం పెరుగుదల కనిపించింది. యూరప్‌లో ఇంటర్నెట్‌ వాడకం 50 పెరిగిందని టెలికాం దిగ్గజం వొడాఫోన్‌ తెలిపింది. స్నేహితులతో సంప్రదించేందుకు ఫేస్‌బుక్‌ పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారని సంస్థ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ అన్నారు. నూతన సంవత్సరం రోజు ఫేస్‌బుక్‌కు ఉండే డిమాండ్‌ను కరోనా ప్రభావం అధిగమించిందని ఆయన పేర్కొన్నారు. నెట్‌ఫ్లిక్స్‌ యూరోపియన్‌ యూనియన్‌లో తన వీడియో నాణ్యతను రాబోయే 30 రోజుల పాటు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీనితో నెట్‌వర్క్‌ ట్రాఫిక్‌ 25 శాతం తగ్గుతుందని భావిస్తోంది. యూట్యూబ్‌ సైతం నెట్‌వర్క్‌ ట్రాఫిక్‌ను తగ్గించేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది.

ఇదీ చూడండి:కరోనా సోకుతుందన్న ఆందోళనలో 'రానా'!

ABOUT THE AUTHOR

...view details