ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాస్తవ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 10.9 శాతంగా నమోదుకావొచ్చని ఎస్‌బీఐకి చెందిన పరిశోధన పత్రం ఎకోరాప్ తన అంచనాలను సవరించింది. అంతకముందు ఇదే నివేదిక ఈ వాస్తవ జీడీపీని -6.8 శాతంగా అంచనావేసింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత జీడీపీ 23.9 శాతం మేర రికార్డు స్థాయిలో క్షీణించిన నేపథ్యంలో సవరణలు చోటు చేసుకున్నాయి. ఈ నివేదిక ఇంకా ఏం చెబుతోందంటే..
- మా ప్రాథమిక అంచనాల ప్రకారం.. 2020-21లో అన్ని త్రైమాసికాల్లోనూ ప్రతికూల వాస్తవ జీడీపీనే నమోదు కావొచ్ఛు ఈ నేపథ్యంలో పూర్తి సంవత్సరానికి రెండంకెల(10.9%) క్షీణత కనిపించొచ్చని భావిస్తున్నాం.
- రెండో త్రైమాసికంలో -12 శాతం నుంచి -15 శాతం; మూడో త్రైమాసికంలో -5 శాతం నుంచి -10 శాతం; నాలుగో త్రైమాసికంలో -2 నుంచి -5 శాతం మేర జీడీపీ తగ్గవచ్ఛు
- తొలి త్రైమాసికంలో క్షీణతకు దేశవ్యాప్తంగా మార్చి 25, 2020 నుంచి విధించిన లాక్‌డౌన్ కారణం. కరోనా కట్టడి చర్యల వల్ల ప్రైవేటు వినియోగ వ్యయంలో భారీగా క్షీణించింది. నిత్యావసర వస్తువుల్లో తప్ప మిగతా వాటిలో గిరాకీ కనిపించలేదు.
- సామర్థ్య వినియోగం లేనందున పెట్టుబడుల్లోనూ రికవరీ కనిపించలేదు. మొత్తం జీడీపీ అంచనాల్లో ప్రైవేటు వినియోగ వ్యయం వాటా పెరగడానికి ఇదీ ఒక కారణం.
- అన్ని ప్రతికూలతల మధ్య రెండు సానుకూలతలు కనిపించాయి. జులై నెలలో అన్ని రంగాల్లోనూ రుణ వృద్ధి కనిపించింది. ఎమ్‌ఎస్‌ఈ, వ్యవసాయ, అనుబంధ కంపెనీలు, వ్యక్తిగత రుణాలు బాగా పెరిగాయి. రెండోది కొన్ని రంగాల్లో కొత్త ప్రాజక్టులు కనిపించాయి. రోడ్లు, ప్రాథమిక రసాయనాలు, విద్యుత్, ఆసుపత్రులు, మురుగు నీటి పైపు లైన్లలో ఇవి ఎక్కువగా కనిపించాయి.
- నిర్మాణం, వాణిజ్యం, హోటళ్లు, విమానయాన రంగాలు పుంజుకోవాల్సిన అవసరం కనిపించింది.
- రవాణా సేవలను తిరిగి పునరుద్ధరించడం వల్ల మౌలిక వసతులకు చేయూత లభించగలదు.