హైడ్రోజన్ సరఫరాకు అవసరమయ్యే మౌలిక వసతులను భారత్ మరింత పెంచుతుందని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ఇతర ఇంధనాలతో పోలిస్తే కర్బన రహిత ఇంధనానికి ఉన్న ప్రయోజనాల దృష్ట్యా ఆ ఇంధన ఉత్పత్తి దిశగా ప్రణాళికలు వేగవంతం చేయాలని భావిస్తున్నామని గురువారం తెలిపారు.
"భవిష్యత్ ఇంధన వనరుగా మారడానికి హైడ్రోజన్‌కు గొప్ప అవకాశాలున్నాయి. హైడ్రోజన్‌పై ఉత్సుకతకు కారణమేంటంటే.. దానిని బ్యాటరీగా మార్చినా లేదా వేడి కోసం మండించినా.. అది భూతాపాన్ని తగ్గిస్తుంది. సహజ వాయువు లేదా బొగ్గు నుంచి కర్బన రహిత హైడ్రోజన్‌ను తయారు చేయొచ్చు. విద్యుత్‌ను ఉపయోగించి నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడదీయవచ్చు. ఇలా ఉత్పత్తి చేసిన హైడ్రోజన్‌ను రవాణా ఇంధనంగానూ ఉపయోగించవచ్చు"
--ధర్మేంద్ర ప్రధాన్, చమురు శాఖ మంత్రి.
ప్రయోగాత్మక ప్రాజెక్టుల పనిలో..
'మన దేశంలో హైడ్రోజన్ సరఫరా, పంపిణీకి పలు సవాళ్లు ఉన్నాయి. అధిక ఉత్పత్తి వ్యయాలకు తోడు హైడ్రోజన్ నిల్వ, రవాణాకు సరిపడే మౌలిక వసతులూ సరిగ్గా లేవు. బ్లూ హైడ్రోజన్(శిలాజ ఇంధనాల నుంచి ఉత్పత్తి చేస్తారు), గ్రీన్ హైడ్రోజన్(పునరుత్పాదక వనరుల నుంచి)లను తయారు చేయడం కోసం ప్రయోగాత్మక ప్రాజెక్టులను సిద్ధం చేసే పనిలో ఉన్నాం' అని తెలిపారు. హైడ్రోజన్ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి దారులు వెతకడంపై అంతర్జాతీయంగా కృషి జరుగుతోందని గుర్తు చేశారు. భారత్‌లోనూ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు వివరించారు. పర్యావరణ, వాతావరణ అంశాల విషయంలో భారత్ కట్టుబడి ఉందని.. గత ఆరేళ్లలో 32 గిగావాట్ల నుంచి 100 గిగావాట్లకు భారత పునరుత్పాదక విద్యుత్‌ను చేర్చినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:'దేశవాళీ ఆవులపై పరిశోధనలు పెరగాలి'