ప్రస్తుతం సంపన్నుల సంఖ్యలో భారత్ 12 వస్థానంలో ఉందని, వచ్చే ఐదు ఏళ్లలో వారి పెరుగుదలలో భారతదేశం మొదటి స్థానంలో ఉండనున్నట్లు ప్రఖ్యాత సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. సంపన్నుల పెట్టుబడి, తదితర విషయాలపై 'వెల్త్ రిపోర్టు 2020' పేరుతో తయారు చేసిన నివేదికను ఆ సంస్థ నేడు విడుదల చేసింది. 220 కోట్ల కంటే ఎక్కువ నికర విలువున్న వారిని సంపన్నులు (అల్ట్రా హై నెట్ వర్త్ ఇండివిడ్యూవల్స్)గా పరిగణించిన ఈ నివేదిక పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తున్నప్పటికీ... 2019లో 51 శాతం సంపన్నులు తమ సంపదను పెంచుకున్నట్లు వెల్లడించింది. 2019లో 5,986 మంది సంపన్నులుండగా... వచ్చే ఐదు సంవత్సరాల్లో ఈ సంఖ్య దాదాపు రెట్టింపు అవుతుందని అంచనా వేసింది.
అగ్రస్థానంలో అమెరికా
ప్రస్తుతం సంపన్నుల జనాభాలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. దాని తరువాతి స్థానంలో చైనా ఉంది. వచ్చే ఐదేళ్లలో వారి పెరుగుదలకు సంబంధించి ఈజిప్టు రెండో స్థానంలో ఉంది. వియత్నాం, చైనా లు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఐదు సంవత్సరాల్లో 44 శాతం వృద్ధితో... 2024 వరకు ప్రపంచంలో రెండో అత్యధిక ధనిక ఖండంగా ఆసియా అవతరించనున్నట్లు నివేదిక తెలిపింది. ప్రస్తుతం ఆ స్థానంలోనున్న ఐరోపా మూడో స్థానానికి పడిపోనుంది. ఐదు సంవత్సరాల్లో ఉత్తర అమెరికాలో సంపన్నుల జనాభా 22 శాతం పెరగనుంది. అప్పటికీ... ఆసియా సంపన్నుల సంఖ్య అందులో సగం మాత్రమే ఉండనుంది. 2019-24 మధ్య సంపన్నుల వృద్ధి రేటులో కూడా ఆసియా 44 శాతంతో మొదటి స్థానంలో ఉండే అవకాశం ఉంది.