సెంట్రల్ అమెరికా దేశమైన ఎల్ సాల్వడార్ (El Salvador Bitcoin) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ (Bitcoin news)) వినియోగాన్ని తమ దేశంలో అధికారికం చేసినట్లు ప్రకటించింది. ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నయిబ్ బుకేలే ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
అంతకు ముందు ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా రెండు దశల్లో.. 400 బిట్కాయిన్లు కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. వీటి విలువ 20 మిలియన్ డాలర్లపైమాటే.
క్రిప్టోకరెన్సీలపై ప్రపంచవ్యాప్తంగా వివిధ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. ఓ దేశం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విశేషం.
ఈ నిర్ణయంతో అమెరికా డాలర్‌తో పాటు.. ఇప్పుడు బిట్‌కాయిన్ కూడా ఆ దేశంలో అధికారికంగా చలామణిలోకి వచ్చింది. దీనితో ఇకపై ఆ దేశ పౌరులు.. పన్నులను బిట్‌కాయిన్ ద్వారా చెల్లించొచ్చు. వస్తు, సేవలకు కూడా దీనిని వినియోగించొచ్చు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర షాపింగ్ కాంప్లెక్స్‌లు ఇకపై బిట్‌కాయిన్ ధరలను కూడా డిస్ప్లేలో ఉంచాల్సి ఉంటుంది.
చట్ట సభల్లో ఆమోదం తర్వాతే..
ఎల్ సాల్వడార్ కాంగ్రెస్‌లో జులైలోనే దీనికి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టారు. మొత్తం 84 మంది సభ్యుల్లో 64 మంది బిల్లుకు మద్దతు తెలిపారు. దీనితో బిట్‌కాయిన్‌ను అధికారికం చేసే ప్రక్రియకు మార్గం సుగమమైంది.