ఎల్‌ఐసీ ఆఫ్ ఇండియా ప్రధాన వాటాదారుగా ఉన్న ఐడీబీఐ బ్యాంకు గత కొన్ని త్రైమాసికాలుగా వరుసగా లాభాలు ప్రకటిస్తోంది. చాలా వరకూ కష్టాలు తొలగిపోయి, వృద్ధి బాటలో ముందుకు సాగుతున్నామని, దీనికి గత కొంతకాలంగా తీసుకున్న దిద్దుబాటు చర్యలే కారణమని ఐడీబీఐ బ్యాంకు డిప్యూటీ ఎండీ సురేష్ ఖతాన్హర్ ‘ఈనాడు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ప్రధానంగా రిటైల్ బ్యాంకింగ్ సేవలకు పెద్దపీట వేసినట్లు, ఐడీబీఐ బ్యాంకును రిటైల్ బ్యాంకింగ్ సేవల సంస్థగా ముందుకు తీసుకువెళ్లాలనేది తమ ప్రధానోద్దేశమని ఆయన స్పష్టం చేశారు. డిజిటల్ సేవలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు, తద్వారా వినియోగదార్లకు మెరుగైన సేవలు అందించే అవకాశం వస్తోందని తెలిపారు. సైబర్ మోసాలను బ్యాంకింగ్ రంగానికి పెను సవాలుగా పేర్కొంటూ, దీన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఉందన్నారు. బ్యాంకింగ్ సంస్థలకు లాభదాయకత తక్కువగా ఉందని, అందువల్ల లాభదాకతను పెంపొందించుకునే మార్గాలపై కసరత్తు చేయాలని సూచించారు. ఇంటర్వ్యూ విశేషాలు..
ఐడీబీఐ బ్యాంకు గత 8 త్రైమాసికాలుగా లాభాలు నమోదు చేస్తోంది. అంటే బ్యాంకుకు కష్టాలు తీరిపోయినట్లేనా ?
సేవలను మెరుగుపరచటంతో పాటు అంతర్గతంగా పని విధానాలను సమర్థంగా తీర్చిదిద్దాం. బ్యాంకు వృద్ధి బాటలో నడవటానికి అవసరమైన పరిస్థితులను కల్పించాం. నైపుణ్యం, అనుభవం ఉన్న వారితో డైరెక్టర్ల బోర్డు ఏర్పాటైంది. వరుసగా 8 త్రైమాసికాలుగా లాభాలు ఆర్జించటానికీ అదే కారణం. ఈ వృద్ధి బాటలో ముందుకు సాగగలమనే విశ్వాసం ఉంది.
ఎటువంటి చర్యలతో ఈ మార్పు సాధ్యమైంది ?
రిటైల్ బ్యాంకు మాదిరిగా ఐడీబీఐ బ్యాంకును మార్చుతున్నాం. తక్కువ మూలధనం అవసరమైన వ్యాపార విధానం వైపు మొగ్గుచూపుతున్నాం. దీనికి తోడు అధిక వడ్డీరేటు చెల్లించాల్సిన డిపాజిట్లను తగ్గించుకొని, కాసా (కరెంటు, సేవింగ్ ఖాతాలు) డిపాజిట్లు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఆటోమేషన్/ డిజిటైజేషన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నందున నిర్వహణ వ్యయాలు తగ్గుముఖం పడుతున్నాయి. బ్రాంచి కార్యకలాపాలను కేంద్రీకరిస్తూ, విక్రయాలు- క్రెడిట్ ప్రాసెసింగ్ కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశాం. తద్వారా తక్కువ సమయంలో మార్పు సాధ్యమైంది.
ప్రస్తుతం బ్యాంకు ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయి ?