రెక్కాడితే గానీ డొక్కాడని ఓ రిక్షా కార్మికుడికి రూ.3 కోట్లు చెల్లించాలంటూ ఇటీవల ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపింది. తాను రోజుకు రూ.500 సంపాదించడమే గగనమని.. ఇంత మొత్తానికి పన్ను నోటీసు రావడమేంటని ముక్కున వేలేసుకోవడం ఆ బడుగు జీవి వంతైంది. అతని పేరిట గుర్తు తెలియని వ్యక్తులు ఒక్క ఏడాదిలో దాదాపు రూ.43 కోట్ల వ్యాపారం చేసినట్లు తేలింది. అంతకుముందు మూడు సంవత్సరాల క్రితం ప్రముఖ క్రికెటర్ అనిల్ కుంబ్లే సతీమణి చేతనకు సైతం ఇటువంటి అనుభవమే ఎదురైంది. ఐటీ రిటర్నుల సమయంలో తాను చేయని రూ.38 లక్షల షాపింగ్ తన ఖాతాలో కనిపించడంతో వెంటనే అప్రమత్తమయ్యారు.
ఇక్కడ వీరిద్దరి పాన్ నెంబరు బయటవారికి (Pan Card misuse) తెలియడం వల్ల మోసపోయారు. పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న చోట ఆ దుకాణాదారుడు రిక్షాకార్మికుడిని మోసం చేస్తే.. ఖరీదైన చేతిగడియారం కొనుగోలు సమయంలో సమర్పించిన పాన్ నెంబరును షాపువాళ్లు దుర్వినియోగం (Pan Card misuse) చేయడం వల్ల చేతన మోసపోయారు. ఈ రెండు సంఘటనలే కాదు. ఇలాంటి మోసాలు (Pan Card Frauds) చాలా జరుగుతున్నాయి. పాన్ కార్డు వినియోగం ఇటీవల పెరిగిన నేపథ్యంలో జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం.
ఈ మధ్యకాలంలో పాన్ నంబర్ లేకుండా దాదాపు ఏ లావాదేవీ జరగడం లేదు. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి డిజిటల్ యాప్స్ దగ్గరి నుంచి స్థిరాస్తి, కార్లు, బైక్‌ల కొనుగోలు ఇలా ప్రతిచోట పాన్ కార్డు అవసరం తప్పనిసరైంది. పన్ను ఎగవేతను అరికట్టడమే దీని ప్రధాన లక్ష్యం. ఒకవేళ అవసరమైన చోట పాన్ కార్డు వివరాలు తెలియజేయలేదంటే.. మనం ఏదైనా కీలక సమాచారాన్ని దాచిపెడుతున్నామని ఐటీ శాఖ అనుమానించాల్సి వస్తుంది. అలాగే మీకు ఎలాంటి పన్ను రాయితీ ప్రయోజనాలు కూడా లభించవు.
పాన్ కార్డు వివరాలు బహిర్గతం చేయడం భద్రమేనా?
పాన్ అవసరం పెరగడంతో చాలా చోట్ల మనకు తెలియకుండానే పాన్ వివరాలు ఇచ్చేస్తున్నాం. కొన్నిసార్లు జిరాక్స్ షాప్‌లు, నెట్ సెంటర్లు.. లేదా ఇతర దుకాణాల్లో పాన్ జిరాక్స్ కాపీలను నిర్లక్ష్యంగా వదిలేస్తుంటాం. కొన్ని సందర్భాల్లో స్కానింగ్‌లకు ఇచ్చి పని పూర్తయ్యాక డిలీట్ చేయించకుండా వచ్చేస్తుంటాం. పైన చెప్పిన మోసాలు జరగడానికి ముఖ్య కారణం ఇదే. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే వ్యక్తిగత వివరాలు బయటకు తెలుస్తున్నాయి. వాటిని కొంతమంది మోసగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. పైగా పాన్ నెంబరు తెలిస్తే.. ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు, బ్యాంకు ఖాతా నెంబర్లను సైతం కూపీ లాగే అవకాశం ఉంటుంది. ఈ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతిలో పడితే.. ఇక చెప్పాల్సిన పనే లేదు.