తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఆక్స్​ఫర్డ్ టీకాను అప్పుడే ఆమోదిస్తారనుకుంటున్నా' - ఆక్స్​ఫర్డ్ బయోకాన్

యూకేలో అనుమతులు లభించిన వెంటనే భారత్​లోనూ ఆక్స్​ఫర్డ్​ టీకాను డీసీజీఐ ఆమోదిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్​పర్సన్ కిరణ్ మజుందర్ షా. భారత్​లో వ్యాక్సినేషన్​ను వెంటనే ప్రారంభించడం అత్యవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు.

biocon
కిరణ్ మజుందర్ షా

By

Published : Nov 24, 2020, 3:16 PM IST

యూకే నియంత్రణ సంస్థ నుంచి అనుమతులు లభించిన వెంటనే ఆక్స్​ఫర్డ్ టీకా అత్యవసర వినియోగానికి(ఈయూఏ) డీసీజీఐ అనుమతిస్తుందని ఆశిస్తున్నట్లు బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్​పర్సన్ కిరణ్ మజుందర్ షా పేర్కొన్నారు. జనవరి నాటికి పది కోట్ల డోసులను సిద్ధం చేయనున్నట్లు సీరం ఇన్​స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా ప్రకటించిన నేపథ్యంలో.. డిసెంబర్​లోనే వ్యాక్సిన్​కు అనుమతులు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్​లో వ్యాక్సినేషన్ ప్రారంభించడం ఇప్పుడు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.

కిరణ్ షా చేసిన ట్వీట్

ఇప్పటికే తమ వద్ద 4కోట్ల డోసులు సిద్ధంగా ఉన్నాయని పూనావాలా సోమవారం వెల్లడించారు. జనవరి నాటికి 10 కోట్ల డోసులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఆక్స్​ఫర్డ్ టీకా 70 శాతం సమర్థంగా పనిచేస్తుందన్న ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు.

ఆక్స్​ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకా ట్రయల్స్​ను భారత్​లో నిర్వహిస్తోంది సీరం సంస్థ.

ఆస్ట్రాజెనెకా సైతం వ్యాక్సిన్ డోసులను భారీగా ఉత్పత్తి చేసేందుకు కసరత్తులు చేస్తోంది. అనుమతులు లభించిన వెంటనే 2021లో 300 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తామని తెలిపింది. ఈ టీకాను సాధారణ రిఫ్రిజిరేటర్లలో ఆరు నెలల వరకు నిల్వ చేసుకోవచ్చని వెల్లడించింది.

ఇదీ చదవండి-పెట్రో ధరల స్పీడుకు బ్రేకులు పడవా!

ABOUT THE AUTHOR

...view details