జీఎస్‌టీ నంబరును కేవలం మూడు రోజుల్లో పొందేలా పన్ను చెల్లింపుదార్లకు, వ్యాపారులకు ఊరట కలిగించే చర్యలను ప్రభుత్వం చేపట్టింది. గత వారం ఆ మేరకు ఆధార్ ఆధారిత జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ను ఆవిష్కరించింది. ఇందులో సమయం తగ్గిపోవడమే కాదు.. చాలా వరకు కేసుల్లో కార్యాలయాన్ని భౌతికంగా తనిఖీ చేయడమూ ఉండకపోవచ్చు.
ఆధార్ ఆధారిత జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ ఎలా పనిచేస్తుందంటే..
కొత్త వ్యాపారులు జీఎస్‌టీ కింద నమోదు చేసుకునే సమయంలో దరఖాస్తుదారుకు ఆధార్ ఆధారిత జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ను ఎంచుకునే వీలుంటుంది. అయితే దరఖాస్తుదారు దీన్ని ఎంచుకోవాలా వద్దా అన్నది వారి ఇష్టమే.
- ఒక వేళ 'యెస్' అని దరఖాస్తుదారు క్లిక్ చేస్తే ప్రమోటర్లు లేదా భాగస్వాములతో పాటు అధీకృత వ్యక్తులకు ఒక అథెంటికేషన్ లింక్ నమోదిత మొబైల్ నంబరు, ఇ-మెయిల్ ఐడీకి వస్తుంది.
- ఆ లింక్‌ను క్లిక్ చేస్తే ఒక డిక్లరేషన్ ఫామ్ వస్తుంది. అందులో ఆధార్ నంబరును ఇవ్వాలి. ఆ తర్వాత 'వాలిడేట్' బటన్‌ను నొక్కాలి.
- మీరిచ్చిన వివరాలు సరైనవి అయితే ఒక ఓటీపీ వస్తుంది. దాన్నీ అందులో పొందుపరచాలి. వాలిడేషన్ ప్రక్రియ పూర్తయి.. స్క్రీన్ మీద ఇ-కేవైసీ అథెంటికేషన్ విజయవంతమైనట్లు ఒక సంక్షిప్త సమాచారం వస్తుంది.
ఎలా ఈ సౌలభ్యాన్ని పొందొచ్చంటే..
www.gst.gov.in లో లాగిన్ అయి.. సర్వీసెస్ కింద ఉన్న రిజిస్ట్రేషన్ టాబ్‌లో న్యూ రిజిస్ట్రేషన్‌ను ఎంచుకోవాలి. లేదంటే రిజిస్ట్రేషన్ నౌ లింక్‌ను సైతం క్లిక్ చేయవచ్ఛు ఆ తర్వాత ఆధార్ అథెంటికేషన్‌ను ఎంచుకోవాలి. మీరు ఆధార్‌లో ఇచ్చిన మొబైల్ నంబరు లేదా ఇమెయిల్ నంబరును తెలుసుకోవాలంటే https://resident.uidai.gov.in/verifyవెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.