కరోనా మహమ్మారి కారణంగా 2020లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దాదాపు ఒకశాతం మేర క్షీణించే అవకాశమున్నట్లు ఐక్యరాజ్యసమితి విశ్లేషించింది. గతంలో ఇదే ఏడాదికి గానూ 2.5 శాతం వృద్ధిని అంచనా వేసిన యూఎన్.. తాజాగా వైరస్ ప్రభావంతో పతనం తప్పదని ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో సరైన ఉద్దీపనలు ప్రకటించకుండా.. వివిధ దేశాలు ఆర్థిక కార్యకలాపాలపై ఆంక్షలు కొనసాగిస్తే ఈ నష్టం మరింత ఎక్కువయ్యే అవకాశాలూ ఉన్నాయని హెచ్చరించింది.
ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం(డీఈఎస్ఏ) చేసిన ఈ విశ్లేషణలో.. ప్రపంచ సరఫరాతో పాటు అంతర్జాతీయ వాణిజ్యానికి కొవిడ్-19 ఆటంకంగా మారిందని వెల్లడైంది. కరోనా కారణంగా గత నెలలో దాదాపు 100 దేశాలకు పైగా జాతీయ సరిహద్దులను మూసివేశాయని, ప్రపంచవ్యాప్తంగా పర్యటక రంగం స్తంభించిపోయిందని డీఈఎస్ఏ పేర్కొంది.
" ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో లక్షలాది మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆయా దేశ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఉద్దీపనలు ప్రకటించేందుకు ముందుకు రావట్లేదు. ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకునే ప్రమాదముంది. 2020లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 0.9 శాతం మేర క్షీణించే అవకాశముంది."
- ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం(డీఈఎస్ఏ)