దేశాన్ని కుదిపేస్తున్న కరోనాపై పోరాడేందుకు రాష్ట్రాలకు నిధుల కొరత లేకుండా కేంద్రం జాగ్రత్తపడుతోంది. రాష్ట్రాలు రూ.3.20లక్షల కోట్లు సమీకరించుకోవడానికి అనుమతిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రిజర్వు బ్యాంకుకు లేఖ రాసింది.
రూ.3 లక్షల కోట్ల సమీకరణకు రాష్ట్రాలకు అనుమతి!
By
Published : Apr 8, 2020, 7:45 PM IST
కరోనా వైరస్ను ఎదుర్కొవడానికి నిధుల కొరతతో సతమతమవుతోన్న రాష్ట్రాలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో బహిరంగ మార్కెట్ నుంచి రూ.3.20 లక్షల కోట్లను సమీకరించుకోవడానికి రాష్ట్రాలకు అనుమతినిచ్చింది.
2020-21 సంవత్సరానికి నిర్ణయించిన నికర రుణ పరిమితి 50 శాతం ఆధారంగా బహిరంగ మార్కెట్ రుణ పరిమితిని పెంచడానికి రాష్ట్రాలను అనుమతించాలని కేంద్రం నిర్ణయించినట్లు ఆర్థిక శాఖ... రిజర్వు బ్యాంకుకు రాసిన లేఖలో పేర్కొంది. 28 రాష్ట్రాలు కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి 9 నెలల్లో రూ.3,20,481 కోట్లు రూపాయలు మొత్తాన్ని బహిరంగ మార్కెట్ నుంచి సేకరించుకోవచ్చని లేఖలో స్పష్టం చేసింది.
రాష్ట్రాల వారీగా
రాష్ట్రాల వారీగా అనుమతించిన నిధుల మొత్తం వివరాలు:
రాష్ట్రం
రూ.కోట్లలో
మహారాష్ట్ర
రూ.46,182
ఉత్తర్ ప్రదేశ్
రూ.29,108
కర్ణాటక
రూ.27,054
గుజరాత్
రూ.26,112
పశ్చిమ బంగాల్
రూ.20,362
రాజస్థాన్
రూ.16,387
ఈ మేరకు బహిరంగ మార్కెట్ నుంచి రాష్ట్రాలు నిధులు సేకరించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని రిజర్వు బ్యాంకును కేంద్రం కోరింది. రాష్ట్రాల అభిప్రాయం తీసుకున్న తర్వాత ఈ నిర్ణీత కాలం(ఏప్రిల్-డిసెంబర్)లో నిధుల సమీకరణ పరిమితి మరింత పెంచే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవడానికి మరింత సౌలభ్యం కల్పిస్తూ ఆర్బీఐ ఇదివరకే తన నిర్ణయాన్ని ప్రకటించింది.