బిట్‌కాయిన్ లాంటి మరో కొత్త క్రిప్టో కరెన్సీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. క్రిప్టో కరెన్సీ ఆధారిత పేమెంట్స్ వ్యవస్థను అభివృద్ధి చేసి, కోట్లాది మంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని ఫేస్బుక్ యోచిస్తున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.
బిట్‌కాయిన్ విలువ భారీ మార్పులకు లోనవుతుంటుంది. అయితే... ఫేస్బుక్ మాత్రం కొత్త క్రిప్టో కరెన్సీ విలువను స్థిరంగా ఉంచనున్నట్లు తెలుస్తోంది.
క్రెడిట్ కార్డులు లేని వ్యవస్థ...
క్రెడిట్ కార్డ్ ప్రాసెసింగ్ రుసుము రూపంలో ప్రస్తుతం బ్యాంకులు భారీగా ఆదాయం ఆర్జిస్తున్నాయి. అలాంటి రుసుములు లేకుండా తెచ్చే కొత్త కరెన్సీతో క్రెడిట్ కార్డుల వినియోగం తగ్గే అవకాశముందని ఆ పత్రిక అంచనా వేసింది. క్రిప్టో కరెన్సీ కోసం ఫేస్బుక్ వివిధ ఆర్థిక సంస్థలు, ఆన్లైన్ వ్యాపారులతో ఇప్పటికే ఒప్పందాలు చేసుకుంటోందని తెలిపింది.
ప్రకటనలు ఇవ్వడం సహా ఇతరత్రా ఫీచర్లు ఉపయోగించిన యూజర్లకు ఫేస్బుక్ రివార్డులూ ఇచ్చే యోచనలో ఉన్నట్లు పేర్కొంది.