రుణాలు, ఈఎంఐల చెల్లింపుపై మరో మూడు నెలల వరకు మారటోరియాన్ని పొడిగిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఆర్థిక రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల రుణగ్రహీతలు అప్పులు చెల్లించకుండా నిర్లక్ష్యం వహించే అవకాశముందని, రానురాను ఇదే అలవాటుగా మారే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
"రుణాల చెల్లింపుపై మరోసారి మారటోరియాన్ని పొడిగిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది రుణగ్రహీతలు అప్పులు చెల్లించకుండా నిర్లక్ష్యం వహించేలా చేస్తుంది. దీనికి బదులు బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు తమ ఆస్తులను తిరిగి వర్గీకరించుకోవడానికి (రీ-క్లాసిఫై) అనుమతించడం మంచిది."
- వినీత్ రాయ్, ఆవిష్కార్ గ్రూప్ ఛైర్మన్
సంక్షోభం దృష్ట్యా
దేశంలో కరోనా సంక్షోభం, లాక్డౌన్ దృష్ట్యా... రుణాల చెల్లింపుపై ఆర్బీఐ మార్చిలో మూడు నెలల మారటోరియం విధించింది. మే 31తో ముగియనున్న ఈ మారటోరియాన్ని మరో 90 రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సౌలభ్యం రుణగ్రహీతలకు తాత్కాలికంగా లాభం చేకూర్చినా.. దీర్ఘకాలంలో ఇబ్బందిగా పరిణమించే అవకాశం ఉంది.
లాక్డౌన్ సమయంలో కేవలం 20 శాతం రుణగ్రహీతలు... రుణాల చెల్లింపుపై మారటోరియం సౌకర్యాన్ని పొందారని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఛైర్మన్ రజనీష్ కుమార్ ప్రకటించడం గమనార్హం.