ఎన్నో సమస్యలు.. మరెన్నో సవాళ్లు... 130 కోట్ల ప్రజల ఆకాంక్షలు.. వీటన్నింటి నడుమ 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది కేంద్రం. జులై 5 ముహూర్తం. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ రెండోసారి అధికారంలోకి వచ్చాక తీసుకొస్తున్న మొదటి పద్దు కావడం వల్ల భారీ అంచనాలు ఉన్నాయి. బడ్జెట్ ప్రజాకర్షకంగా ఉంటుందా.. సంస్కరణ బాట పడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. పూర్తిస్థాయి కేంద్ర ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా చరిత్ర సృష్టించిన నిర్మలా సీతారామన్ మొదటి పరీక్షను ఎదుర్కోబోతున్నారు.
ఆశల పల్లకిలో..
ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మోదీ ప్రభుత్వం అనేక ప్రజాకర్షక నిర్ణయాలు తీసుకుంది. మధ్య తరగతి వర్గాలకు ఊరటనిచ్చే పన్ను రిబేటు పెంపు లాంటివి ప్రకటించింది. రైతు సంక్షేమం కోసం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది. ఈ బడ్జెట్లోనూ కొత్త పథకాలతో పాటు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు చోటుంటుందని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న పన్ను మినహాయింపు స్థాయిని రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని ప్రజలు కోరుతున్నారు. బడ్జెట్ స్లాబులనూ ప్రభుత్వం తగ్గిస్తుందని ఆశిస్తున్నారు.
గత బడ్జెట్ సందర్భంగా కిసాన్ సమ్మాన్ నిధిని కేవలం చిన్న, మధ్య తరహా రైతులకే వర్తింపజేశారు. ఒక్కో రైతుకు వార్షికంగా రూ.6వేలు ఇచ్చే ఈ పథకాన్ని రైతులందరికీ వర్తింపజేయాలని రెండోసారి అధికారంలోకి వచ్చాక నిర్వహించిన తొలి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయించింది మోదీ ప్రభుత్వం. ఈ మొత్తాన్ని పెంచాలన్నది రైతుల ఆశ. ఎన్డీఏ కీలక హామీ అయిన రైతు ఆదాయం రెట్టింపు కోసం చర్యలు తీసుకుంటారని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
అధిగమించేనా..?
2018-19లో భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధి 5.8 శాతానికి పడిపోయింది. ఆర్థిక మందగమనాన్ని అధిగమించి వ్యవస్థను పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఆర్థిక మంత్రి ముందు ఉన్న అతిపెద్ద సవాల్ ఇదే.