కరోనా సంక్షోభంతో (Corona Pandemic) ఆర్థిక పరిస్థితిలో ఊహించని మార్పులొచ్చాయి. ఆర్థిక బలాలు, బలహీనతలపై దృష్టి సారిస్తూ అప్రమత్తంగా ఉంటేనే అనుకున్న ఆర్థిక లక్ష్యాలు నెరవేరుతాయి. అందుకు కావాల్సిన ప్రణాళికలేంటో మీరూ తెలుసుకోండి..
అత్యవసర నిధితో..
కరోనా లాక్‌డౌన్ పరిణామాల నేపథ్యంలో చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న సంఘటనలు చూశాం. చాలామంది తమ దగ్గరున్న అత్యవసర నిధి నిల్వలను వాడుకున్నారు. పరిస్థితులు కాస్త సర్దుకున్నా.. పూర్తిగా కుదుటపడ్డాయని చెప్పలేం. కాబట్టి, ఖర్చయిన నిధిని జమ చేసేందుకు ప్రయత్నించాలి. ఆర్థిక నిపుణులు చెప్పే సలహా ప్రకారం కనీసం 3 నుంచి గరిష్ఠంగా 6 నెలల వరకూ సరిపోయే ఖర్చులతో అత్యవసర నిధి ఉండాలి. దీన్ని ఒకేసారి పోగు చేయలేం కాబట్టి, క్రమానుగతంగా పెట్టుడులు పెట్టాలి. ఖర్చు చేసిన తర్వాత పొదుపు చేయడం కాకుండా.. పొదుపు చేసిన తర్వాత ఖర్చు చేయడం అనే నియమం పెట్టుకుంటేనే ఇది సాధ్యమవుతుంది.
అప్పుల సంగతేమిటి?
మహమ్మారి సమయంలో ఖర్చులను వెళ్లదీయడానికి కొందరు అప్పులను ఆశ్రయించారు. ఇందులో బ్యాంకుల నుంచి తీసుకున్న వ్యక్తిగత రుణాలు లేదా క్రెడిట్ కార్డుల వాడకం.. ఏదైనా సరే.. అప్పులు మనల్ని బాధించకుండా చూసుకోవాల్సిందే. ఒకసారి మొత్తం అప్పులు ఎంతున్నాయన్నది చూసుకోండి. వాటిని ఒకేచోటకు మార్చేందుకు ఏదైనా అవకాశం ఉందా పరిశీలించండి. ఉదాహరణకు గృహరుణం మీద టాపప్‌లాంటివి చూడండి. దీనివల్ల వడ్డీ భారం తక్కువగా ఉంటుంది.