తెలంగాణ

telangana

ETV Bharat / business

Edible oil self reliant: మన వంట నూనెకు మరో 15-20 ఏళ్లు ఆగాల్సిందే! - వంటనూనెలో స్వావలంబన

వంట నూనెల్లో భారత్​ స్వయం సమృద్ధి సాధించాలంటే మరో రెండు దశాబ్దాలు పట్టొచ్చన్నారు భారత సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, పరిశ్రమ దిగ్గజం బి.వి.మెహతా. రైతుల అనుకూల ప్రభుత్వ విధానాలతో ఇది సాధ్యపడుతుందని చెప్పారు. ఈ పంటలు వేసే వారికి తగిన ప్రతిఫలం అందుతుందన్న భరోసాను ప్రభుత్వం కల్పిస్తేనే ఇది సాధ్యమవుతుందన్నారు.

Edible oil self reliant
Edible oil self reliant

By

Published : Dec 12, 2021, 9:27 AM IST

Updated : Dec 12, 2021, 9:54 AM IST

Edible oil self reliant: మన దేశం వంట నూనెల్లో స్వయం సమృద్ధి సాధించాలంటే కనీసం మరో 15-20 ఏళ్లు పట్టొచ్చని భారత సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, పరిశ్రమ దిగ్గజం బి.వి.మెహతా అభిప్రాయపడ్డారు. ఇది సాధ్యం కావాలన్నా ప్రభుత్వ విధానాలు రైతులకు అనుకూలంగా ఉండాలని పేర్కొన్నారు. దేశంలో వంట నూనెల వినియోగం ఏటా 2-3% చొప్పున పెరుగుతున్నందున, దిగుమతులు ప్రస్తుత స్థాయికే పరిమితం చేయాలన్నా, భారత్‌ ఏడాదికి 20 లక్షల టన్నుల నూనె గింజల దిగుబడిని పెంచుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ పంటలు వేసే వారికి మంచి ప్రతిఫలం అందుతుందన్న భరోసాను ప్రభుత్వం కల్పిస్తేనే ఇది సాధ్యమవుతుందని వార్తా సంస్థ 'ఇన్ఫామిస్ట్‌'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మరెన్నో విషయాలు పంచుకున్నారు.

నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాకారమవుతుందా ?

గత 15-20 ఏళ్లుగా ఈ అంశంపై మాట్లాడుకుంటూనే ఉన్నాం. ప్రభుత్వ విధానాలు రైతులకు అనుకూలంగా ఉంటే మరో 15-20 ఏళ్లలో ఇది సాకారం కావొచ్చు. లేకపోతే మనం దిగుమతులపై ఆధారపడక తప్పదు. 1992లో మన అవసరాల్లో 3 శాతం వంట నూనెల్ని దిగుమతి చేసుకునే వాళ్లం. ఇప్పుడు అది 65-70 శాతానికి పెరిగింది. నూనె గింజలకు సరైన ప్రతిఫలం అందనందునే, రైతులు ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఏటా 2-3 శాతం మేర వంట నూనెలకు గిరాకీ పెరుగుతోంది. ప్రస్తుతం 2.2 కోట్ల టన్నుల వినియోగం జరుగుతోంది. దిగుమతులు బాగా పెరగడంతో బిల్లుభారం రూ.1.2 లక్షల కోట్లకు చేరింది. 2019-20లో ఇది రూ.80,000 కోట్లే. నూనెల దిగుమతుల్ని ప్రస్తుత స్థాయి అయిన 1.3-1.5 కోట్ల టన్నుల వద్దే ఉంచాలంటే, ఏటా 20 లక్షల టన్నుల నూనె గింజల్ని అదనంగా పండించాలి.

ప్రధాన వంట నూనెల ధరలు సమీప కాలంలో ఎలా ఉంటాయనుకుంటున్నారు ?

అంతర్జాతీయ విపణిలో ధరలు అలాగే ఉన్నాయి. జనవరి-ఫిబ్రవరి వరకు ధరలు చల్లబడతాయని నేను అనుకోవట్లేదు. మార్చి తర్వాత ధరలు తగ్గొచ్చని చాలా మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వం ఇటీవలే వంట నూనెల దిగుమతులపై సుంకం తగ్గించి, దాన్ని వినియోగదార్లకు బదిలీ చేయమని నూనె తయారీ కంపెనీలకు సూచించింది కదా ?

దిగుమతి సుంకం ప్రకటన వచ్చినపుడు ధర కిలోకు రూ.10-12 మేర తగ్గింది. తర్వాత మళ్లీ అంతర్జాతీయంగా ధరలు పెరిగాయి. దీంతో వినియోగదార్లకు లభించిన ప్రయోజనం ఆవిరైపోయింది. సుంకాన్ని తగ్గించే బదులు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా దిగువ మధ్య తరగతి ప్రజలకు రాయితీపై వంట నూనెల్ని అందిస్తే బాగుంటుంది.

నూనెలపై దిగుమతి సుంకం తగ్గించడంతో మన రైతులకు ఇబ్బంది ఉంటుందని అనుకుంటున్నారా ?

రైతులు పంట వేసేటపుడు ఏ ధర ఉందో చూసుకుంటారు. సుంకాల్లో మార్పు, ఇతర అంశాలు కేవలం పరిశ్రమకు మాత్రమే. రైతులు వీటిని పట్టించుకోరు. అయితే విధాన మార్పుల వల్ల వారు పండించిన పంటకు కనీస మద్దతు ధర రాకపోతేనే వారు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఒక నిధి ఏర్పాటు చేసి, కనీస మద్దతు ధరతో పంటను కొనుగోలు చేసేందుకు వినియోగించాలి.

నూనె గింజల రంగం బాగుపడాలంటే ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు ?

నూనె గింజలపై జాతీయ మిషన్‌ కోసం మేం ఎదురుచూస్తున్నాం. తగినన్ని నిధులతో వీలైనంత త్వరగా ఇది ఏర్పాటు అవుతుందని భావిస్తున్నాం. ప్రభుత్వానికి దిగుమతి సుంకం రూపంలో రూ.40,000 కోట్ల ఆదాయం వస్తోంది. ఇందులో రూ.5,000 కోట్లను నూనె గింజల అభివృద్ధి పథకానికి వినియోగించాలని కోరుతున్నాం.

ఇదీ చూడండి:Economic Recovery: 'వ్యవసాయం అండతో ఆర్థిక వృద్ధి పరుగులు'

Last Updated : Dec 12, 2021, 9:54 AM IST

ABOUT THE AUTHOR

...view details