కరోనా మహమ్మారి ప్రభావం నుంచి దేశ ఆర్థికవ్యవస్థ ఊహించిన దానికంటే ఎక్కువగానే పుంజుకుంటుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. అయితే, పండుగల సీజన్ ముగిసిన వేళ.. ఈ కొనుగోలు శక్తి స్థిరత్వంపై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఫారెన్ ఎక్స్ఛేంజి డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన ప్రపంచదేశాల మాదిరిగానే భారత్ కూడా ఆర్థికవృద్ధి క్షీణతను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.
'ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 23.9శాతం క్షీణించగా, 2021 ఆర్థిక సంవత్సరానికి ఇది 9.5శాతానికి తగ్గనున్నట్లు అంచనా వేశాం. కానీ, లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో పాటు పండుగల సీజన్‌లో కోలుకోవడం చూస్తున్నాం. రెండో త్రైమాసికంలో సాధారణంగానే ఉండగా, ప్రస్తుతం అంచనా వేసిన దానికంటే ఎక్కువగా ఆర్థిక పురోగతి కనిపిస్తోంది' అని శక్తికాంతదాస్ పేర్కొన్నారు. అయితే, ఈ వృద్ధి కొనసాగుతున్న సమయంలోనే యూరప్‌తో పాటు భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో వైరస్ మళ్లీ విజృంభించడం ఈ రికవరీపై ప్రభావం చూపే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.