స్పుత్నిక్ - వి వ్యాక్సిన్ ను భారత్ లో అందించేందుకు ప్రస్తుతం డాక్టర్ రెడ్డీస్ మాత్రమే ఏకైక సరఫరాదారు అని డాక్టర్ రెడ్డీస్ స్పష్టం చేసింది. భారత్‌లో తమ కంపెనీ కాకుండా స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను అందిస్తామనే థర్డ్ పార్టీ వ్యక్తులు, సంస్థలపై జాగ్రత్త వహించాలని డాక్టర్ రెడ్డీస్, ఆర్ఐఎఫ్ సంయుక్తంగా ప్రకటించాయి. స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ను భారత్‌లో అందించేందుకు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టమెంట్ ఫండ్‌తో డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. తద్వారా 250 మిలియన్ డోసుల వ్యాక్సిన్‌ను దేశవ్యాప్తంగా డాక్టర్ రెడ్డీస్ అందించనుంది. ఇందుకోసం ప్రస్తుతం కోల్డ్ స్టోరేజీ లాజిస్టిక్స్, ట్రాక్ అండ్ ట్రేస్ వంటి ఏర్పాట్లపై కంపెనీ పనిచేస్తోంది.
తద్వారా జూన్ మధ్య నాటికి వ్యాక్సిన్ ను కమర్షియల్ లాంఛ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తూ.. ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లతో ఒప్పందాల కొరకు చర్చలు జరుపుతోంది. అయితే స్పుత్నిక్ వ్యాక్సిన్ ను డాక్టర్ రెడ్డీస్ తరుపున సరఫరా కొరకు తాము ఇప్పటివరకు ఎటువంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదని.. స్పుత్నిక్ వ్యాక్సిన్ ను డాక్టర్ రెడ్డీస్ కాకుండా తామే సరఫరాదారులంటూ ఎవరైనా పేర్కొంటే వారి పట్ల జాగ్రత్త వహించాలని డాక్టర్ రెడ్డీస్ స్పష్టం చేసింది. ఈమేరకు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ తో కలిసి సంయుక్త ప్రకటనను విడుదల చేసింది.