భారత్-చైనా మధ్య లద్దాక్‌లోని సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో కీలక నిర్ణయం తీసుకుంది టెలికాం విభాగం (డాట్). ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 4జీ సేవల అభివృద్ధిలో చైనా ఉపకరణాలను వినియోగించొద్దని సూచించాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
" బీఎస్ఎన్ఎల్ 4జీ అప్‌గ్రెడేషన్‌లో చైనా పరికరాలను వినియోగించొద్దని సూచించాలని టెలికాం విభాగం చర్చల్లో నిర్ణయం తీసుకున్నారు. 4జీ టెండర్ పనుల విషయంలో పునఃపరిశీలించాలని టెలికాం శాఖ సూచించనుంది. ఇలాంటి ఆదేశాలే మహానగర్ టెలికాం నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్)కూ చేయనుంది. చైనాలో తయారయ్యే టెలికాం ఉత్పత్తులపై ప్రైవేటు సంస్థలు అధికంగా ఆధారపడటాన్ని తగ్గించేలా చర్యలను పరిశీలిస్తోంది. గతంలో చైనా ఉత్పత్తుల నెట్వర్క్ భద్రతపై ఆందోళనలు చెలరేగాయి."