దేశంలో ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్‌కు ఫోన్ చేసినప్పుడు ఇక నుంచి సున్నా(0)ను చేర్చాలి. ఈ మేరకు ట్రాయ్ చేసిన సిఫారసును టెలికాం విభాగం (డాట్) ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని టెలికాం సంస్థలకు సూచించింది డాట్. ఇందుకు అనుగుణంగా ల్యాండ్‌లైన్ నంబరు డయిలింగ్ ప్యాటరన్‌లో మార్పులు చేయాలని నిర్దేశించింది.
"ఈ నిబంధన అమల్లోకి వచ్చిన నాటి నుంచి ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్‌కు కాల్ చేసినప్పుడు సున్నాను చేర్చడాన్ని అనుసరించాలి. ఈ నిబంధన గురించి ల్యాండ్‌లైన్ చందాదారులకు తెలియజేయాలి. ల్యాండ్‌లైన్ చందాదారులు సున్నాను చేర్చకుండా నంబరు డయల్ చేసిన ప్రతిసారి ఈ ప్రకటన వినిపించాలి" అని డాట్ పేర్కొంది.