భారత్ బయోటెక్ సంస్థ కరోనా నివారణకు దేశీయంగా రూపొందించిన కొవాగ్జిన్.. ఔషధ పరిశోధన ( క్లినికల్ ట్రయల్ ) దశ దాటి, సీరం సంస్థ తయారుచేసిన కొవిషీల్డ్ మాదిరి అత్యవసర వినియోగానికి సాధికార అనుమతి పొందిందని కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈ మేరకు నీతి ఆయోగ్ సభ్యుడు (వైద్యం) డాక్టర్ వీకే పాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఇపుడు కొవిషీల్డ్, కొవాగ్జిన్ రెండూ సమాన స్థాయి పొందాయన్నారు. కొవాగ్జిన్‌పై ఇక నుంచి ఎలాంటి పరిశోధన ఆంక్షలు ఉండవని స్పష్టం చేశారు.
పరీక్ష నెగ్గింది
ఇప్పటికే 19 లక్షల మంది ఈ వ్యాక్సిన్ తీసుకున్నారని, భద్రతపరంగా చూస్తే.. కొవాగ్జిన్ కాలపరీక్ష నెగ్గిందని వీకే పాల్ అన్నారు. కేవలం 311 మందిలో కొద్దిపాటి నలత కనిపించిందని తెలిపారు. భారత పరిశోధనలకు, సాధించిన సాంకేతిక ప్రగతికి ఇది దిగ్విజయమని ఆయన అభివర్ణించారు. ప్రభుత్వం మూడోదశ వ్యాక్సినేషన్ గురించి ఏమైనా ఆలోచిస్తోందా అనే ప్రశ్నకు పాల్ బదులిస్తూ.. 'ప్రస్తుతానికి 60 ఏళ్లు పైబడ్డ వారిపై.. పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 45-60 ఏళ్ల మధ్య ఉన్నవారిపైన దృష్టి పెడుతున్నాం. ఈ వర్గం విస్తృతంగా ఉంది. ఫలితాలు సమీక్షించుకొంటూ ముందుకు వెళతాం. ఆ తర్వాత అర్హులందరికీ టీకాలు అందిస్తాం' అని అన్నారు.
ఇదీ చదవండి :'కొవాగ్జిన్ సేఫ్.. దుష్ప్రభావాలు లేవు'