తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా ప్రభావం: హోటళ్లకు దడ - పర్యాటకంపై కరోనా ప్రభావం

చైనాలో వందలమందిని బలితీసుకుంటున్న భయంకర వైరస్ కరోనా ప్రభావం హోటళ్ల పరిశ్రమపై తీవ్రంగా పడింది. వైరస్ వ్యాపించకుండా విద్యా సంస్థలు సహా పలు రంగాలకు చైనా, హాంకాంగ్​ దేశాలు సెలవు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో పర్యాటకుల రాక తగ్గిపోతోంది. కరోనా కేసులు బయటపడిన కేరళ రాష్ట్రంలోనూ హోటల్ బుకింగ్​లు అతిథులు రద్దు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

dangerous coronavirus effect on hotel industry
కరోనా ప్రభావం: హోటళ్లకు దడ

By

Published : Feb 11, 2020, 7:42 AM IST

Updated : Feb 29, 2020, 10:45 PM IST

చైనాలో వందలమందిని బలిగొంటూ, భారత్‌ సహా మరో 20 దేశాలకు విస్తరిస్తున్న కరోనా వైరస్‌ పేరు వింటేనే హోటల్‌ పరిశ్రమకు దడపుడుతోంది. అత్యంత త్వరగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే వీలున్న కరోనా వైరస్‌ బారిన పడకుండా చూసేందుకు, ఫిబ్రవరి మాసం విద్యాసంస్థలు సహా పలు రంగాలకు చైనా, హాంకాంగ్‌ సెలవు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో, చైనా సమీపంలో ఉన్న దేశాలకు పర్యాటకుల రాక బాగా తగ్గిపోతోంది. ఇప్పటికే మన దేశంలోనూ కరోనా వైరస్‌ బాధితులు బయట పడిన కేరళ రాష్ట్రంలోనూ హోటల్‌ బుకింగ్‌ను అతిథులు రద్దు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్న సంగతి విదితమే. ఈ పరిస్థితి మరింత తీవ్రమవుతుందనే ఆందోళన పరిశ్రమ వర్గాల్లో ఉంది.

పర్యాటకంలో కీలకపాత్ర ఆతిథ్యరంగానిదే. విహారానికి వచ్చే పర్యాటకులతో పాటు వ్యాపారం/విధుల్లో భాగంగా వచ్చే ఖాతాదారుల వల్లే హోటళ్లకు అధికాదాయం వస్తుంటుంది. రిస్క్‌ చేసి పర్యటనలకు వెళ్లడం ఎందుకు అని కొందరు మానుకుంటుంటే, మరికొందరు ఆసియా దేశాలకు దూరంగా ఇతర ప్రాంతాలకు వెళ్తున్నట్లు సమాచారం. చైనాలో 40,000 మందికి పైగా కరోనా వైరస్‌ బారిన పడగా, 900 మంది అశువులు బాశారు. భారత్‌ సహా 20 దేశాలో మరో 300 కేసులను ధ్రువీకరించారు. ఈ వ్యాధి దేశంలోకి ప్రబలకుండా చూసేందుకు ప్రధాన విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లో క్షుణ్నంగా వైద్యపరీక్షలు చేస్తున్నారు. చైనా వెళ్లిన విదేశీ పర్యాటకులు, మన దేశానికి రాకుండా ఆంక్షలు విధించి, రోడ్డు, వాయు, జల మర్గాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు కూడా. చైనాకు మనదేశం నుంచి విమానాల రాకపోకలు కూడా ఆగిపోయాయి. వేలమంది ప్రయాణించే వీలున్న నౌకల్లోనూ ప్రమాదకర వైరస్‌ బాధితులు ఉండటంతో, వాటిని తీరానికి రాకుండా జపాన్‌ వంటి దేశాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇవన్నీ కూడా హోటల్‌ రంగానికి చేటుచేసేవే.

కోలుకుంటున్న సమయంలో..

గదులు నిండటం తక్కువగా ఉండటానికి తోడు, రోజువారీ అద్దె కూడా పెరగకపోవడం హోటల్‌ రంగాన్ని 2018 ఆరంభం వరకు ఇబ్బంది పెట్టింది. తదుపరి ఈ 2 అంశాల్లోనూ కోలుకుంది. ఫలితంగా కొత్త హోటళ్ల నిర్మాణ జోరు పెరిగింది. అంతర్జాతీయ మందగమనం కొంత ఇబ్బందికరంగా మారినా, గతేడాదిలో హోటళ్లలో గదుల భర్తీ 65 శాతం ఉండటం సంతృప్తి కలిగించేదే. ఇప్పుడు విదేశీ పర్యాటకుల రాకతగ్గుతున్నందున, ప్రీమియం హోటళ్లపై అధిక ప్రభావం పడుతోంది. ఎందుకంటే, వీటిల్లో దిగేవారిలో 60-70 శాతం విదేశీయులే ఉంటారు. ‘పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. సమీపకాలంలో ఇది తీవ్ర భయాందోళనకు దారితీయొచ్చు’ అని హోటళ్ల సంఘం ప్రతినిధులు చెబుతున్నారు.

ఆదాయమిచ్చే త్రైమాసికమిది

పాశ్చాత్యదేశాల్లో క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకలు ముగిశాక, జనవరి-మార్చిలో వ్యాపార కార్యకలాపాలు ఊపందుకుంటాయి. అందువల్ల వ్యాపార పర్యాటకులతో ఇక్కడి హోటళ్లకూ ఆదాయం బాగుంటుంది. ఫిబ్రవరిలో దేశీయ హోటళ్లు విదేశీ అతిథులతో కళకళలాడుతుంటాయి. ఈసారి కరోనా వైరస్‌ దెబ్బకు, వీరి రాక బాగా తగ్గింది. భారత్‌కే కాదు.. ఆసియా దేశాలకు వచ్చేందుకే పర్యాటకులు వెనుకాడుతున్నారని జర్మనీ కేంద్రంగా పనిచేసే డేటాపోర్టల్‌ స్టాటిస్టా వెల్లడించింది.

పర్యాటకంపై కరోనా ప్రభావం

షేర్లపైనా ప్రభావం

ఆతిథ్యరంగంపై కరోనా వైరస్‌ ప్రభావాన్ని గమనించిన బ్రోకరేజీ సంస్థలు, దిగ్గజ హోటళ్ల షేర్ల రేటింగ్‌నూ తగ్గిస్తున్నాయి. ఇండియన్‌ హోటల్స్‌, ఓరియెంటల్‌ హోటల్స్‌ షేర్లకు ‘బై’ నుంచి ‘హోల్డ్‌’కు ఐసీఐసీఐడైరెక్ట్‌.కామ్‌ తగ్గించింది. సగటు గది అద్దె, గదుల భర్తీ రేటును గణిస్తే, ఒక గదిపై వచ్చే సగటు ఆదాయంలో వృద్ధి నెమ్మదిస్తుందని ఎడెల్‌వీస్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంటోంది. గత 3 త్రైమాసికాలుగా ఈ వృద్ధి 4-5 శాతం ఉందని, ఇప్పుడు 1 శాతానికి పరిమితం కావచ్చని అంచనా వేస్తోంది. ఇండియన్‌ హోటల్స్‌ విక్రయాలపై 20-25 శాతం ప్రభావం ఉండొచ్చని స్థానిక బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. సార్స్‌ (సివియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌) మరణాలను 2 నెలల్లోనే కరోనా వైరస్‌ దాటినందున, ఇప్పుడే భయాందోళనలు అధికమవుతాయని, వచ్చే ఆరేడు నెలలు కష్టకాలమేనని పలు హోటళ్ల నిర్వాహకులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: నగరాలు తెప్పరిల్లేందుకు కావాలి.. సరైన వ్యూహం!

Last Updated : Feb 29, 2020, 10:45 PM IST

ABOUT THE AUTHOR

...view details