తెలంగాణ

telangana

ETV Bharat / business

భగ్గుమంటున్న ఇంధన ధరల్ని చల్లార్చేదెలా?

సెప్టెంబరు-అక్టోబరు నెలల్ని మినహాయిస్తే ఇంధనం ధరలు నిరంతరాయంగా ఎగబాకుతూనే వచ్చాయి. 'పెట్రోలియం ప్రణాళిక, విశ్లేషణ విభాగం (పీపీఏసీ)' గణాంకాల ప్రకారం, 2020 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు- దిల్లీలో పెట్రోలు ధరలను 56 సార్లు, డీజిల్​ ధరలను 67 సార్లు సవరించారు. అంతర్జాతీయంగా కొవిడ్‌ భయాలు తొలగి యథాపూర్వ స్థితి నెలకొంటున్న దశలో అంతర్జాతీయ ముడి చమురు ధరల విజృంభణ ఇలాగే కొనసాగితే, మన కష్టాలు మరింత తీవ్రమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

curbing rising fuel prices is big challenge before the government amid pandemic
భగ్గుమంటోన్న ఇంధన ధరల్ని చల్లార్చేదెలా?

By

Published : Dec 17, 2020, 9:05 AM IST

ఇంధన ధరలు మళ్లీ వేడెక్కాయి. డిసెంబరు తొమ్మిదో తేదీన దేశ రాజధాని దిల్లీలో పెట్రోలు, డీజిలు ధరలు 2018 అక్టోబరు నాటి గరిష్ఠ స్థాయిని అందుకున్నాయి. పెట్రోలు దాదాపు 84 రూపాయలకు, డీజిలు 74 రూపాయలకు పెరిగాయి. ఈ రేట్లు ప్రస్తుతానికి నిలకడగా ఉన్నా, మరింతగా పెరగనున్నాయి. దేశీయ చమురు ధరల పెరుగుదలకు మౌలికంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది- అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరల పురోగమనం. భారత్‌ ప్రధానంగా దిగుమతి చేసుకునే బ్రెంట్‌ రకం ముడి చమురు పీపా 49 డాలర్లు పలుకుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ ధర 19 డాలర్లే. అంటే ఎనిమిది నెలల్లో రెండున్నర రెట్లు ప్రియమైంది. ఇంధన ధరలపై నియంత్రణను తొలగిస్తూ, 2010లో భారత ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అప్పటి నుంచి దేశీయ ధరలు అంతర్జాతీయ ఇంధనాలతో అనుసంధానమయ్యాయి. సాంకేతికంగా చెప్పాలంటే- అక్కడ ధరలు పెరిగితే ఇక్కడా పెరిగి తీరాలి. 'ఒపెక్‌ ప్లస్‌' దేశాల కూటమి కుదుర్చుకున్న తాజా ఒప్పందం ప్రపంచ విపణిలో ముడి చమురు ధరలకు రెక్కలు తొడిగింది. కొవిడ్‌ ఆంక్షలు తొలగడం, టీకా రాక సమీపించడం వంటి అంశాల నేపథ్యంలో ఇంధనాలకు మున్ముందు గిరాకీ అధికమయ్యే అవకాశం ముడి చమురు ధర పెరగడానికి రెండో కారణం. దీంతో దేశీయ ధరలూ పైపైకి ఎగిశాయి.

పన్ను విధానాల గందరగోళం

పెట్రో ధరలు పెరగడం వెనక సహేతుక కారణాలు ఉన్నప్పటికీ, అవి పెరుగుతున్న తీరు విచిత్రంగా ఉంది. 2018 అక్టోబరులో పెట్రోలు లీటరు 84 రూపాయలు పలికినప్పుడు, ప్రపంచ విపణిలో ముడి చమురు ధర పీపాకు 80 డాలర్లు ఉండేది. ఇప్పుడు అంతర్జాతీయ ముడి చమురు అంతకంటే చాలా చాలా తక్కువగా 49 డాలర్ల వద్దే ఉన్నా, దేశీయ ఇంధన ధరలు అక్టోబరు ధరల్ని అందుకున్నాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఉండాలన్న 2010 విధానం ప్రకారం, నిజానికివి చాలా తక్కువగా ఉండాలి. కానీ అందుకు విరుద్ధంగా జరుగుతోంది. అటు కేంద్రం ఇటు రాష్ట్రాలు కలిసి ఇంధనాల మీద పన్నులు, సుంకాలు, రుసుములు ఎడాపెడా పెంచేయడమే ఈ వైరుధ్యానికి కారణం. దిల్లీ ధరలనే తీసుకుంటే- ఎక్సైజ్‌ సుంకం, వ్యాట్‌ల వాటా పెట్రోలు రేటులో 63 శాతం, డీజిలులో 60 శాతం దాకా ఉంది.

కొవిడ్‌ ప్రభావంతో కేంద్రం, రాష్ట్రాల ఆదాయ వనరులు ఛిన్నాభిన్నమయ్యాయి. మరోవైపు మహమ్మారి విజృంభించిన కాలంలో వాటి వ్యయాలు భారీగా పెరిగాయి. దీంతో ఆదాయాలను పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా ఇంధనాలపై కన్నేశాయి. 'పెట్రోలియం ప్రణాళిక, విశ్లేషణ విభాగం (పీపీఏసీ)' గణాంకాల ప్రకారం, 2020 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు- దిల్లీలో పెట్రోలు ధరలను 56 సార్లు, డీజిలు ధరలను 67 సార్లు సవరించారు. సెప్టెంబరు-అక్టోబరు నెలల్ని మినహాయిస్తే ధరలు నిరంతరాయంగా ఎగబాకుతూనే వచ్చాయి. వాస్తవానికి ముడి చమురు చవకగా మారినప్పుడు రాష్ట్రాలు పన్నులను పెంచి లబ్ధి పొందాయి. అంతర్జాతీయ ధరల తగ్గింపు ఫలాలు దేశీయ వినియోగదారుడికి అందకుండా, నొప్పి తెలియకుండా హస్తలాఘవం ప్రదర్శించాయి. ఇప్పుడు భౌగోళిక రాజకీయ పరిణామాలతో ప్రపంచ ఇంధన విపణి జోరందుకుంది.

అధిక ధరల పర్యవసానాలు

ఇంధనం మీద పన్నుల విధింపు ద్వారా ఆదాయాలు పెంచుకోవడం ప్రభుత్వాలకు సులువైన పనే. కానీ అదే పనిగా పెంచుతూ పోతే అది బెడిసి కొడుతుంది. భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. ఈ చర్య తాలూకు దుష్పరిణామాల్లో మొట్ట మొదటిది, అతి ముఖ్యమైనది- ద్రవ్యోల్బణం. ప్రస్తుతం చిల్లర ధరల ద్రవ్యోల్బణం 7.6 శాతం వద్ద ఏడేళ్ల గరిష్ఠ స్థాయికి చేరువలో ఉంది. బార్క్‌లేస్‌ సంస్థ అంచనా ప్రకారం, ముడి చమురు 10 డాలర్లు పెరిగితే దాని ప్రభావంతో లీటరు పెట్రోలు ధర సమారు అయిదు రూపాయలకు పైగా పెరుగుతుంది. చిల్లర ధరల ద్రవ్యోల్బణం మూడు నుంచి ఆరు నెలల్లో దాదాపు 34 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు = ఒక పర్సంటేజీ పాయింటు) పెరుగుతుంది. పెట్రో పన్నులను పరిగణనలోకి తీసుకోకుండా వేసిన అంచనా ఇది. వాటినీ లెక్కలోకి తీసుకుంటే, ద్రవ్యోల్బణం ఇంకా అధికంగా ఉంటుంది.

అంతర్జాతీయంగా కొవిడ్‌ భయాలు తొలగి యథాపూర్వ స్థితి నెలకొంటున్న దశలో అంతర్జాతీయ ముడి చమురు ధరల విజృంభణ ఇలాగే కొనసాగితే, మన కష్టాలు మరింత తీవ్రమవుతాయి. ఇంధన ధరల ప్రభావంతో ద్రవ్యోల్బణం అదుపు తప్పకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇంధన ధరలు అదుపులో ఉండేలా జాగ్రత్త పడాలి. అధిక ఇంధన ధరల రెండో ప్రమాదకర పరిణామం- ఆర్థిక వ్యవస్థలో గిరాకీ కుప్పకూలడం. ఇది స్థూల ఆర్థిక అస్థిరతకు దారితీస్తుంది. ఎలాగంటే- ఇంధనం మీద అధిక వ్యయం చేయడం వల్ల వినియోగదారుల చేతిలో డబ్బు తగ్గుతుంది. ఆ మేరకు వారి కొనుగోళ్లు క్షీణిస్తాయి. ఫలితంగా వస్తుసేవలకు గిరాకీ తగ్గుతుంది. దీర్ఘకాలంలో ఈ పరిణామానికి సంబంధించిన ఆర్థిక పర్యవసానాలు విషమంగా ఉంటాయి. మనం గుర్తించాల్సిన మూడో అంశం- రోడ్డు మార్గ సరకు రవాణాలో విరివిగా వినియోగించే ఇంధనం, డీజిలు. ఈ ఇంధన ధర పెరిగిపోవడం రవాణా రంగానికి, ఆ రంగం మీద ఆధారపడిన అసంఖ్యాక ప్రజానీకానికి అశనిపాతం అవుతుంది. చివరిది, ఏమాత్రం విస్మరించలేనిది మరొకటి ఉంది. మహమ్మారి జాగ్రత్తల్లో భాగంగా ప్రజా రవాణా వ్యవస్థలో పూర్తి పునరుద్ధరణ ఇప్పటికీ జరగలేదు. భారీ సంఖ్యలో ప్రజలు వ్యక్తిగత వాహనాలపైనే ఆధార పడుతున్నారు. ఇప్పటికే కొవిడ్‌తో అంతంత మాత్రంగా ఉన్నవారి ఆర్థిక స్థితిని అధిక ఇంధన ధరల భారం ఇంకా కుంగదీస్తుంది.

నిగ్రహం పాటించాలి...

ఇలాంటి అన్ని రకాల ప్రమాదకర పర్యవసానాలను విస్మరించకుండా ప్రభుత్వాలు సామాన్యుడి జీవితంపై ప్రత్యక్ష ప్రభావం కనబరచే ఇంధనాలపై మరిన్ని పన్నులు మోపకుండా ఇకనైనా నిగ్రహం వహించాల్సి ఉంటుంది. తాత్కాలికంగా పన్నులు తగ్గించడం లేదా పెంచకుండా ఉండటం ఒక్కటే- అధిక ఇంధన ధరలతో ఉత్పన్నమయ్యే సర్వసమస్యలకూ పరిష్కారం కాబోదు. దేశ స్థూల ఆర్థిక సుస్థిరతకు అవసరమైన ఆర్థిక ప్రణాళికల మీద దృష్టి సారించేందుకు విధాన నిర్ణేతలకు అది కొంత వెసులుబాటు కల్పిస్తుంది. అదే సమయంలో శిలాజ ఇంధనాల వినియోగాన్ని అదుపు చేసే అవకాశాలనూ పాలకులు అన్వేషించాలి. దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఉపకరించే సంప్రదాయేతర, కాలుష్య రహిత ఇంధన వనరుల అభివృద్ధికి వారు సమధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

రచయిత- కె.ఎమ్‌. బాబు.

ఇదీ చదవండి:ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు ఈసీ చర్యలు

ABOUT THE AUTHOR

...view details