సాధారణంగా బ్యాంకులు తక్కువ లిమిట్‌తో క్రెడిట్ కార్డులను అందిస్తాయి. ఆదాయాల్లో వృద్ధిని అనుసరిస్తూ రీపేమెంట్ తీరును బట్టి ఆ లిమిట్‌ను బ్యాంకులు పెంచుతుంటాయి. క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవటం వల్ల ఉండే లాభాలు నష్టాలను తెలుసుకుందాం.
క్రెడిట్ స్కోరుకు క్రెడిట్ యుటిలైజేషన్ నిష్పత్తి చాలా ముఖ్యం. మొత్తం ఉన్న క్రెడిట్ లిమిట్లో ఉపయోగించిన మొత్తం శాతమే ఇది. సాధారణంగా 30 శాతం కంటే ఎక్కువ క్రెడిట్ ఉపయోగించుకున్నట్లయితే.. ఎక్కువ క్రెడిట్ అవసరం ఉన్నట్లు బ్యాంకులు భావిస్తాయి. దానివల్ల తిరిగి చెల్లింపుపై అనుమానపడుతుంటాయి. క్రెడిట్ యుటిలైజేషన్ నిష్పత్తి 30 శాతం కంటే ఎక్కువైతే క్రెడిట్ స్కోరు తగ్గుతుంది.
అయితే ఎక్కువ క్రెడిట్ ఉపయోగించుకునేవారు ఎక్కువ లిమిట్ ఉన్న కార్డు తీసుకోవటం ద్వారా క్రెడిట్ యుటిలైజేషన్ నిష్పత్తి తగ్గిపోతుంది. ఉదాహరణకు మీకు లక్ష రూపాయల లిమిట్‌తో క్రెడిట్ కార్డు ఉందనుకోండి. నెలవారీగా 50వేలు ఉపయోగిస్తున్నట్లయితే సీయూఆర్ 50 శాతంగా ఉంటుంది. రూ.70వేల లిమిట్‌తో మరో క్రెడిట్ కార్డును తీసుకోవటం లేదా లక్ష 70 వేలకు ప్రస్తుత క్రెడిట్ లిమిట్‌ను పెంచుకోవటం ద్వారా సీయూఆర్ 29 శాతానికి తగ్గుతుంది. ఈ విధంగా క్రెడిట్ స్కోరుపై ప్రభావం తగ్గించుకోవచ్చు.
ఆర్థిక అవసరాలకు..
ఉద్యోగాల కోత, అనారోగ్యం, ప్రమాదం తదితర అత్యవసరాల సమయాల్లో డబ్బుల కొరత ఏర్పడినప్పుడు.. పెరిగిన క్రెడిట్ లిమిట్ ఆదుకునే అవకాశం ఉంటుంది. బిల్లు చెల్లించాల్సిన గడువులోపు చెల్లించే సామర్థ్యం లేనట్లయితే నెలవారీ వాయిదాలు(ఈఎమ్ఐ)లుగా మార్చుకోవచ్చు. సాధారణంగా చెల్లించని బ్యాలెన్స్‌పై వడ్డీ 30-49 శాతం ఉంటుంది. ఈఎమ్ఐకి మార్చుకోవటం వల్ల అవుట్ స్టాండింగ్ మొత్తంపై వడ్డీని తగ్గించుకోవచ్చు.
రుణ లభ్యత పెరుగుతుంది