తెలంగాణ

telangana

By

Published : Mar 17, 2021, 7:05 AM IST

ETV Bharat / business

అమెరికాకు కొవాగ్జిన్‌ టీకా- 'ఆక్యుజెన్‌ ఇంక్' సన్నాహాలు

భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన 'కొవాగ్జిన్' టీకాను త్వరలో అమెరికా మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఆక్యుజెన్​ ఇంక్​ సంస్థ సన్నాహాలు చేస్తోంది. కొవాగ్జిన్ అత్యవసర వినియోగ అనుమతి కోసం అమెరికా ఔషధ నియంత్రణ సంస్థను సంప్రదించినట్లు ఆక్యుజెన్ ఇంక్ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ శంకర్‌ ముసునూరి వెల్లడించారు. 10 కోట్ల డోసులను విక్రయించే నిమిత్తం భారత్‌ బయోటెక్‌తో ఇదివరకే ఒప్పందం సైతం చేసుకుంది ఆక్యుజెన్​ ఇంక్​.

Coronavirus Update: US pharma seeks to bring COVAXIN to United States
అమెరికాకు కొవాగ్జిన్‌ టీకా- ఆక్యుజెన్‌ ఇంక్ సంస్థ సన్నాహాలు

భారత్‌ బయోటెక్‌కు చెందిన 'కొవాగ్జిన్‌' టీకా అమెరికా విపణికి అందుబాటులోకి రానుంది. ఇందుకోసం అమెరికాలోని ఆక్యుజెన్‌ ఇంక్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ టీకాను అమెరికాలో 10 కోట్ల డోసుల మేర విక్రయించే నిమిత్తం భారత్‌ బయోటెక్‌తో కొంతకాలం క్రితం ఆక్యుజెన్‌ ఇంక్‌ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో భారత్‌ బయోటెక్‌ నుంచి కొన్ని టీకా డోసులు దిగుమతి చేసుకుని అమెరికాలో విక్రయిస్తామని, ఆ తర్వాత టీకా తయారీని అమెరికాలోనే చేపడతామని ఆక్యుజెన్‌ ఇంక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ శంకర్‌ ముసునూరి వెల్లడించారు. దీనికి అత్యవసర వినియోగ అనుమతి కోసం అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) ను సంప్రదించినట్లు తెలిపారు.

యూఎస్‌ఎఫ్‌డీఏ నిబంధనల ప్రకారం కొవిడ్‌-19 టీకాను అమెరికాలో పరీక్షించి ఉండాలి. టీకా తయారీ యూనిట్లకు యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి అవసరం. నిబంధనల ప్రకారమే అనుమతి తీసుకునే పనిలో తాము నిమగ్నమైనట్లు శంకర్‌ ముసునూరి పేర్కొన్నారు. మిగిలిన సంస్థలన్నీ పెద్దవారికి టీకా ఇవ్వడంపై దృష్టి సారించినందున, సురక్షితమైన కొవాగ్జిన్‌ను తొలిదశలో 12 ఏళ్లు పైబడిన పిల్లలకు సరఫరా చేసే అంశంపై తాము దృష్టి సారిస్తామని తెలిపారు. ఇప్పటికే భారత్‌లో 12 ఏళ్ల పైబడిన పిల్లలపై ఈ టీకా పరీక్షలు నిర్వహిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.

80 కోట్ల డోసులకు ఆర్డర్లు

అమెరికా ప్రభుత్వం 'ఆపరేషన్‌ వార్ప్‌ స్పీడ్‌' కార్యక్రమం కింద ఫైజర్‌-బయాన్‌టెక్‌, మొడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థల నుంచి 80 కోట్ల డోసుల టీకా కొనుగోలుకు ఉత్తర్వులు ఇచ్చింది. ఇవన్నీ 16 ఏళ్ల కంటే అధిక వయస్సు గల వారికి ఇచ్చే టీకాలే. పిల్లలపై ఈ టీకాలను ఇంకా పరీక్షించలేదు. అందువల్ల పిల్లలకు ఇచ్చేదిగా కొవాగ్జిన్‌ టీకాను అమెరికాలో సరఫరా చేయాలనుకుంటున్నట్లు ఆయన వివరించారు. దీనికి సంబంధించిన భారత్‌ బయోటెక్‌ నుంచి క్లినికల్‌ పరీక్షల సమాచారాన్ని కోరుతున్నట్లు తెలిపారు.

భారత్‌లో 20 లక్షల మందికి

కొవాగ్జిన్‌ టీకాను భారతదేశంలో ఇప్పటి వరకు 20 లక్షల మందికి ఇచ్చారు. ఏడాదికి 70 కోట్ల డోసుల మేర ఈ టీకా తయారు చేయాలన్నది భారత్‌ బయోటెక్‌ ప్రణాళిక. దేశీయ అవసరాలతో పాటు ఎగుమతులపైనా ఈ కంపెనీ దృష్టి సారించింది.

ఇదీ చదవండి:రైలు ప్రమాదంలో గాయపడ్డ గజరాజుకు చికిత్స

ABOUT THE AUTHOR

...view details