Corona Insurance: కరోనా సోకిన వారు, కొత్త బీమా పాలసీలు తీసుకోవడం కష్టంగా మారుతోంది. కొవిడ్ నుంచి కోలుకుని, నెగిటివ్‌గా తేలిన తర్వాత కనీసం మూడు నెలల తర్వాతే వారు కొత్తగా తీసుకోవాలనుకుంటున్న పాలసీల దరఖాస్తులను బీమా సంస్థలు ఆమోదిస్తున్నాయి. ఇప్పటివరకు ‘కొన్ని నిర్ణీత వ్యాధుల నుంచి కోలుకున్న వారికి (గుండెజబ్బులు, మూత్రపిండ వ్యాధులు, లివర్ సిరోసిస్ లాంటివి)’ కొత్త పాలసీలు ఇవ్వాలంటే ‘వేచి ఉండే వ్యవధి’ ఆరోగ్య బీమా పాలసీలకు మాత్రమే అమలవుతోంది. ఇప్పుడు ఈ జాబితాలోకి కొవిడ్-19 సైతం చేరింది. పైగా జీవిత బీమా సంస్థలూ దీన్ని పాటించడం మొదలుపెట్టాయి. టర్మ్ పాలసీలు జారీచేసేందుకు కూడా కొవిడ్ తగ్గిన 90 రోజుల వరకు వేచిచూస్తున్నాయి.
రెండేళ్లుగా కరోనా ఎంతోమంది జీవితాల్ని ప్రభావితం చేసింది. ఎన్నో కుటుంబాలు తమ ఆర్జన శక్తిని కోల్పోయాయి. ఈ సమయంలో ఎంతోమందికి జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు కొంత మేరకు ఆర్థిక రక్షణ కల్పించాయి. 2020-21 సంవత్సరాల్లో జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు తీసుకున్న వారి సంఖ్యా భారీగా పెరిగింది. చాలామంది తమ పాలసీల విలువను పెంచుకున్నారు. అయితే, క్లెయింల సంఖ్య పెరగడంతో బీమా సంస్థలు కొత్త పాలసీల జారీలో పలు జాగ్రత్తలను తీసుకుంటున్నాయి.
ప్రీమియం పెంపు
జీవిత బీమా సంస్థలు ఇప్పటికే టర్మ్ పాలసీల ప్రీమియాన్ని 15-30 శాతం వరకు పెంచాయి. సాధారణంగా బీమా కంపెనీలు రూ.20 లక్షలకు మించిన పాలసీలను రీఇన్సూరెన్స్ చేయిస్తాయి. క్లెయింల సంఖ్య పెరగడంతో రీ ఇన్సూరెన్స్ సంస్థలు ఒక్కసారిగా ప్రీమియాన్ని పెంచాయి. ఈ భారాన్ని దేశీయ బీమా సంస్థలు పాలసీదారులకు మళ్లించాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ అలియంజ్ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్‌తో పాటు మరికొన్ని బీమా సంస్థలు ఇప్పటికే ప్రీమియాన్ని పెంచాయి. ఎక్కువమంది పాలసీలు తీసుకునే ఫిబ్రవరి, మార్చిలో ప్రీమియాన్ని పెంచేందుకు చాలా బీమా సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఒకప్పుడు మరణాల రేటు తక్కువగా ఉండటంతో బీమా సంస్థలు పూర్తి రక్షణకు పరిమితమైన టర్మ్ పాలసీలను తక్కువ ప్రీమియానికే అందించేవి. ఎక్కువమందికి పాలసీలు ఇవ్వాలనే లక్ష్యంతోనే ఇవి పనిచేసేవి. కానీ, కొవిడ్ ఈ పరిస్థితులను మార్చేసింది.
కఠిన నిబంధనలు..