మార్కెట్ సూచీలు బాగా పెరిగాయి.. అందుబాటులోకి ఎప్పుడొస్తుందో ఏమో.. అని ఎదురుచూసిన వారికి మరోసారి మంచి అవకాశం లభించింది. కరోనా వైరస్ భయంతో ప్రపంచమంతా అల్లాడుతుంటే.. 'మంచి అవకాశం' అంటారేమిటని సందేహం వస్తుందా? నిజమేనండీ.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని.. పెట్టుబడులు పెట్టే వారికి ఇది ఎంతో అనుకూలమైన తరుణమే. అందరూ ఆందోళనతో ఉన్నప్పుడు మార్కెట్లోకి ప్రవేశించాలి.. ఇదే ఇప్పుడు పాటించాల్సిన మదుపు మంత్రం.
గత వారమంతా స్టాక్ మార్కెట్ మదుపరులకు నష్టాలతో కష్టాలను చూపించింది. సోమవారం (ఫిబ్రవరి 24న) సెన్సెక్స్ 40,772 పాయింట్లతో ప్రారంభమైతే.. శుక్రవారం (ఫిబ్రవరి 28న) 38,297తో ముగిసింది. అంటే దాదాపు 6శాతం నష్టం. ఆర్థిక మందగమనంతో ఇబ్బందులు పడుతున్న మార్కెట్లకు కరోనా రూపంలో కొత్త చిక్కులు వచ్చాయి. అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుందనే మాట ఇప్పుడు మారింది. చైనాకు వైరస్ సోకితే.. ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతోంది. ఇలాంటప్పుడు.. చిన్న మదుపరులు ఏం చేయాలన్నది ప్రధానంగా తెలుసుకోవాలి..
లక్ష్యం వదిలేయొద్దు
పెట్టుబడిని ప్రారంభించేప్పుడే దానికో లక్ష్యం నిర్దేశించుకోవాలి. ఇక మన దృష్టంతా దానిపైనే ఉండాలి. ఉదాహరణకు రాబోయే 20 ఏళ్ల వరకూ నెలకు రూ.5,000 మదుపు చేయాలి.. కనీసం 12 శాతం వార్షిక రాబడి రావాలి.. అనే లక్ష్యంతో మార్కెట్లోకి ప్రవేశించారు. ఈ 20 ఏళ్ల కాలంలో సూచీలకు ఎన్నో ఆటుపోట్లు వస్తాయి. వాటన్నింటి గురించీ మనకు అవసరం లేదు. మార్కెట్ ప్రతి దశలోనూ మన పెట్టుబడులు ఉన్నాయా లేదా అనేదే ప్రధానం. ఎంతోకొంత నష్టభయం లేకుండా పెట్టుబడులు ఉండవు.ఇక్కడ మరో ముఖ్య విషయం.. అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి ఎక్కువ వ్యవధి లేదనుకోండి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్టుబడులను కొనసాగించడం ఇబ్బందికరమే. మరింత నష్టాలు రాకముందే ఈక్విటీల్లో ఉన్న పెట్టుబడులను.. కాస్త సురక్షిత పథకాల్లోకి మళ్లించడం మేలు. మీరు ఇప్పుడిప్పుడే మదుపు ప్రారంభించారనుకుందాం.. మార్కెట్ తగ్గుతోంది అంటే కొత్త అవకాశం ఇచ్చినట్లే. వీలైతే క్రమానుగత పెట్టుబడి మొత్తాన్ని పెంచేందుకూ ప్రయత్నించవచ్చు. ఇంకా అనుమానాలున్నాయనుకోండి.. కొత్త పెట్టుబడులకు కాస్త విరామం ఇవ్వండి. మార్కెట్‌పై మరింత స్పష్టత వచ్చాకే మదుపు తిరిగి ప్రారంభించండి. ఆందోళన, అత్యాశ రెండూ మన శత్రువులే. వీటిని కట్టడి చేయాలి. పూర్తి వివరాలు తెలుసుకుని, స్పష్టమైన అవగాహనతో మదుపు కొనసాగించాలి.
నష్టం సహజం..
షేర్లు, వీటి ఆధారంగా పనిచేసే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు.. వీటిలో ఎంతో కొంత నష్టభయం సహజమే. ఆమాటకొస్తే.. ప్రతి పెట్టుబడి పథకంలోనూ ఎంతోకొంత నష్టభయం అంతర్లీనంగా ఉంటుంది. మార్కెట్లో ఎప్పుడూ ఆటుపోట్లు వస్తూనే ఉంటాయి. ఇలా వచ్చే ప్రతిదశలోనూ కొత్త పెట్టుబడులకు అవకాశాలుంటాయి. ప్రతిసారీ లాభాలే రావు.. ఎప్పుడూ నష్టపోం. మార్కెట్, పెట్టుబడులపైన ఆసక్తి ఉన్న మదుపరులు పరిస్థితులతో సంబంధం లేకుండా సరికొత్త అవకాశాలను అందుకుంటూనే ఉంటారు. ఏ విధంగా ఉన్నా కొంతమంది లాభాలు సంపాదిస్తుంటారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో మీరు ఎంత వరకూ నష్టభయం భరించగలరనే విషయాన్ని లెక్కించండి. నష్టం వచ్చినా తట్టుకోగలం అనుకుంటే.. చైనాతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న రంగాల్లో పెట్టుబడి పెట్టండి. పరిస్థితులు సర్దుకున్నాక అవి అధిక రాబడులను అందించే అవకాశం లేకపోలేదు.చాలా సందర్భాల్లో మదుపరులు నష్టభయాన్ని అంచనా వేసుకోరు. దీంతో సంక్షోభాలు వచ్చినప్పుడు తమ పెట్టుబడులన్నింటినీ ఒకేసారి వదిలించుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇది సరైన విధానం కాదు. ఒకసారి మీ పెట్టుబడుల జాబితాను పరిశీలించండి. అందులో ఉన్నవి ఏ మార్కెట్ దశలనైనా తట్టుకొని నిలబడగలవా అని ప్రశ్నించుకోండి. ఒకవేళ అందులో సరైన షేర్లు, ఫండ్లు, ఇతర పథకాలు లేకపోతే వాటిని వదిలించుకోండి. నాణ్యమైనవి జాబితాలో జత చేసేందుకు ప్రయత్నించండి. ప్రస్తుతం స్థిరమైన రాబడినిచ్చే పథకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. లార్జ్‌క్యాప్, బ్లూచిప్ షేర్లలో మదుపు చేసే మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవాలి. హెచ్చుతగ్గులు అధికంగా ఉండే స్మాల్‌క్యాప్ ఫండ్లలో పెట్టుబడి మొత్తాన్ని తగ్గించుకోవడమే మేలు.