అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో పటిష్ఠ పురోగతి కనిపిస్తోందని, ఇరుదేశాల మధ్య 'దశలవారీ ఒప్పందం' కుదిరేందుకు మార్గం సుగమమైందని చైనా ముఖ్య అనుసంధాన కర్త, ఉపప్రధాని లియుహి తెలిపారు. వాణిజ్య యుద్ధం ముగియడం ఇరుదేశాలకే కాక ప్రపంచానికి కూడా మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ట్రంప్ డిమాండ్లు ఇవీ..
చైనాతో వాణిజ్య యుద్ధానికి గతేడాది తెరలేపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అయితే ఈనెల 11న జరిగిన 13వ రౌండ్ వాణిజ్య చర్చల తరువాత ఈ అంశంపై ఒక ఒప్పందం చేసుకునే దిశగా ఇరుదేశాలు అడుగులేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
" మేధో సంపత్తి హక్కులు (ఐపీఆర్), సాంకేతిక బదిలీని పరిరక్షించడానికి డ్రాగన్ వాగ్దానం చేయాలి. అలాగే చైనా వాణిజ్యలోటు తగ్గించే దిశగా ఆ దేశ మార్కెట్లోకి అమెరికా ఉత్పత్తులను ఎక్కువగా ప్రవేశపెట్టేందుకు అవకాశం కల్పించాలి. తాజా ఒప్పందం కుదుర్చుకోవడానికి 3 నుంచి 5 వారాలు పడుతుంది. మొదటి ఒప్పందం కుదర్చుకున్న వెంటనే రెండో దశ పనులు ప్రారంభమవుతాయి. ఈ ఒప్పందాన్ని తనతోపాటు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆమోదించవచ్చు."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
మరోవైపు... మొదటి దశ ఒప్పందంలో భాగంగా అమెరికా ఉత్పత్తుల కోసం చైనా ఆర్థిక సేవల మార్కెట్‌ను మరింతగా తెరుస్తామని, సాంకేతిక బదిలీ సమస్యకు రెండో దశలో పరిష్కారం జరుగుతుందని చైనా ఆర్థికమంత్రిత్వశాఖ తెలిపింది.