ట్వీట్, చిత్రం, వీడియో మీమ్స్.. రూపమేదైనా కావచ్చు... సోషల్ మీడియాలో మనకు తరుచూ ఇవి కనిపిస్తుంటాయి. వాటిని చూసినప్పుడు కాసేపు నవ్వుకొని వదిలేస్తాం. వాటిని పెద్దగా పని, పాట లేని వాళ్లు తయారు చేశారని అనుకుంటాం. అయితే అది ఒకప్పుడు. ఇప్పుడు ట్రెండ్ మారింది! సరదాగా చేసే మీమ్స్‌ను నాన్ ఫంజిబుల్ టోకెన్స్(ఎన్ఎఫ్టీ) రూపంలో విక్రయిస్తూ.. లక్షల్లో సంపాదిస్తున్నారు మీమర్స్.
సరదాగా తీసిన ఫొటోలను గానీ, వీడియోలకు గానీ కాస్త సృజనాత్మకతను జోడించి.. ఎన్ఎఫ్టీ రూపంలో రూ.లక్షల నుంచి కోట్లలో గడిస్తున్నారు. భారత్‌లో తక్కువే గానీ అమెరికాలో మాత్రం.. ఈ ట్రెండ్ బాగా నడుస్తోంది.
ఇటీవల ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ తొలి ట్వీట్‌ను ఎన్ఎఫ్టీ రూపంలో విక్రయించగా.. రూ.21కోట్లు పలికింది. అలాగే హ్యూమనాయిడ్ రోబో సోఫియా గీసిన చిత్రాలకు అదే ఎన్ఎఫ్టీలో భారీ ఆదరణ లభించింది.
ఇలానే మీమ్స్ కూడా భారీ ధరకు అమ్ముడుపోతున్నాయి. అలా ఇటీవల ఎన్ఎఫ్టీల రూపంలో విక్రయించి.. వేల డాలర్ల నుంచి లక్షల డాలర్లు పలికిన మీమ్స్ వివరాలు మీకోసం..
బ్యాడ్ లక్ బ్రియాన్
దురదృష్టకర సందర్భాలను సూచించే ఈ మీమ్ మార్చిలో ఇథీరియం క్రిప్టోకరెన్సీ రూపంలో దాదాపు 36 వేల డాలర్లకు అమ్ముడుపోయింది.
డిజాస్టర్ గర్ల్
ఇందులోని అమ్మాయి పేరు జోస్ రోత్. డిజాస్టర్ గర్ల్‌గా పేరొందిన ఈ మీమ్ 5 లక్షల డాలర్లకు అమ్ముడైంది.
డాగ్
క్రిప్టోకరెన్సీల్లో డాగ్ కాయిన్ చాలా ఆదరణ పొందింది. దానిని సూచించే కుక్క బొమ్మ.. కొద్ది రోజుల క్రితం ఇథీరియం క్రిప్టోకరెన్సీ రూపంలో దాదాపు 40 లక్షల డాలర్లకు అమ్ముడుపోయింది.