కరోనా మహమ్మారి కారణంగా ప్రజా జీవనంలో భారీ మార్పులు వచ్చాయి. కరెన్సీ ద్వారా కరోనా వ్యాపిస్తుందేమోనన్న అనుమానాలు మొదలయ్యాయి. వైరస్ భయాలతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల కరెన్సీ వాడకాన్ని తగ్గించారు. నగదు ద్వారా వైరస్ వ్యాప్తి ప్రమాదం తక్కువేనని అధికారులు, వైద్య నిపుణులు చెప్తున్నా.. ఎవరూ పూర్తిగా నమ్మడం లేదు.
'అతి'జాగ్రత్తలా?
వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని కరెన్సీ వ్యవహారంపై కొందరు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరెన్సీ ఉపయోగించే సమయంలో గ్లౌజులు ధరిస్తున్నారు. వైరస్ చనిపోతుందన్న ఉద్దేశంతో డబ్బులను ఓ చోట ఉంచి కొన్ని రోజులపాటు అలా వదిలేస్తున్నారు. బ్యాంకు నోట్లపై క్రిమి సంహారకాలను జల్లుతున్నారు. ఇంకొందరైతే కరెన్సీ నోట్లను ఏకంగా మైక్రోవేవ్లో ఉంచి వేడి చేస్తున్నారు.
ఈ అనుమానాల నేపథ్యంలో బ్యాంకులు సైతం ప్రజల సంక్షేమం కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. చైనాలోని ఓ బ్యాంకు కస్టమర్లకు నగదును అందించే ముందు అందించే ముందు అల్ట్రావైలెట్ కిరణాలను ఉపయోగించి నోట్లను శుభ్రపరుస్తోంది.
నగదుపై కుదరని వేటు!
ఇప్పుటికిప్పుడు ఆర్థిక వ్యవస్థను నగదు రహితంగా మార్చడం సాధ్యమేనా? అంటే కొంచెం కష్టమే అని చెప్పుకోవచ్చు. స్వీడన్, ఫిన్లాండ్, నార్వే, కెనడా దేశాలు ఇప్పటికే నగదు రహిత లావాదేవీలకు పెద్దపీట వేశాయి. మరికొద్ది రోజుల్లో యూకే, ఆస్ట్రేలియా దేశాలు పూర్తిగా నగదు రహిత వ్యవస్థలుగా మారనున్నాయి. స్మార్ట్ఫోన్ ఆధారిత పేమెంట్ సేవలు ప్రారంభమైన తర్వాత చైనాలో నగదు వాడకం తగ్గింది. కానీ మిగతా ప్రపంచ దేశాలది మాత్రం ఒక్కసారిగా నగదుపై వేటు వేయలేని పరిస్థితి.
మానవ ప్రపంచానికి ఈ భౌతిక నగదుతో శతాబ్దాలుగా విడదీయరాని బంధం ఉంది. ఆస్ట్రియా, జర్మనీ దేశాల్లో నగదును ఎంతో ఆదరిస్తారు. 'నగదు చాలా అందమైనది' అంటూ అక్కడ ఓ సామెత కూడా ప్రాచుర్యంలో ఉంది.
వైరస్ తెచ్చిన మార్పు
కానీ, వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి పరిస్థితులు మారుతున్నాయి. గత కొద్ది వారాల వ్యవధిలో తమ దేశంలోని 43శాతం మంది ప్రజలు తమ చెల్లింపు విధానాన్ని మార్చుకున్నట్లు జర్మనీకి చెందిన బుండెస్ బ్యాంక్ గణాంకాలు చెబుతున్నాయి. కాంటాక్ట్ లెస్ చెల్లింపులు చేసేందుకే ఎక్కువ శాతం ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు బ్యాంకు వెల్లడించింది.