తొలి పబ్లిక్ ఆఫర్ నిబంధనల్లో మరిన్ని సంస్కరణలు తెచ్చేందుకు సెబీ కసరత్తు చేస్తోంది. బుక్ బిల్డింగ్, ధరల నిర్ణయ విధానం, ధరల శ్రేణి సహా మరికొన్ని నిబంధనల్లో మార్పులు చేయనున్నామని సెబీ ఛైర్మన్ అజయ్ త్యాగీ వెల్లడించారు. ఫ్రిఫరెన్షియల్ ఇష్యూల్లోనూ సంస్కరణలు తెస్తామని ఫిక్కీ నిర్వహించిన వార్షిక కేపిటల్ మార్కెట్ సదస్సులో ఆయన చెప్పారు. వివిధ మార్గాల్లో నిధుల సమీకరణ విధానాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉంటామని వెల్లడించారు.
ఎక్కువ కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వచ్చేలా ప్రజల కనీస వాటా పరిమితిని సవరించామని గుర్తు చేశారు. అంకుర సంస్థల నమోదు ప్రక్రియను మరింత సులువు చేసేందుకు ఇన్నోవేటర్స్ గ్రోథ్ ప్లాట్‌ఫాంలో మార్పులు చేయడంతో, ప్రారంభ దశలోనే పలు కొత్త కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు రావడం గణనీయంగా పెరిగిందని చెప్పారు.
భారత్‌లోనూ ఎస్‌పీఏసీలు
ప్రపంచవ్యాప్తంగా ఐపీఓల స్వరూపంలో మార్పులు వస్తున్నాయని త్యాగీ తెలిపారు. గతేడాది అమెరికా విపణుల్లో ఎస్‌పీఏసీలు (స్పెషల్ పర్పస్ అక్వయిజేషన్ కంపెనీస్) గణనీయంగా పెరిగాయని వెల్లడించారు. నిధుల సమీకరణతో పాటు నేరుగా నమోదు అనే విధానం అమెరికాలో తెరపైకి వచ్చిందన్నారు. భారత్‌లోనూ ఎస్‌పీఎసీ లాంటి విధానాన్ని తీసుకొనే వచ్చే అంశాన్ని ప్రైమరీ మార్కెట్ అడ్వయిజరీ కమిటీ పరిశీలిస్తోంది. ప్రత్యేక పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధులు సమీకరించి, ఆ నిధులను ఏదేని కంపెనీల కొనుగోలుకు ఉపయోగిస్తుంటాయి.