Diesel price hiked: డీజిల్ వినియోగదారులకు పిడుగు లాంటి వార్త! బల్క్ యూజర్లకు డీజిల్ రేట్లను భారీగా పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. లీటరు డీజిల్ ధరను రూ.25 మేర పెంచాయి.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 40 శాతం మేర పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, పెట్రోల్ బంకుల్లో విక్రయించే డీజిల్ రిటైల్ ధరలు ప్రస్తుతానికి యథాతథంగా ఉండనున్నాయి.
ప్రస్తుతం ముంబయిలో లీటరు బల్క్ డీజిల్ ధర రూ.122.05 ఉండగా.. రిటైల్ పెట్రోల్ బంకుల్లో రేటు రూ.94.14గా ఉంది. దిల్లీలో బల్క్ డీజిల్ ధర రూ.115 ఉంటే.. రిటైల్ ధర రూ.86.67 ఉంది.
బస్సులకు ఇంధనం.. బంకుల్లోనే..
బల్క్ ధరలు మార్కెట్ రేట్ల కన్నా అధికంగా ఉన్న నేపథ్యంలో.. బస్సులు సాధారణ పెట్రోల్ బంకుల్లోనే ఇంధనాన్ని నింపుకొంటున్నాయి. చమురు సంస్థల నుంచి నేరుగా పెట్రోల్, డీజిల్‌ను ఆర్డర్ చేసుకునే మాల్స్, ట్రావెల్స్ సర్వీసులు సైతం.. బంకులపైనే ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకుల్లో ఇంధన విక్రయాలు భారీగా పెరిగాయి. దీంతో రిటైలర్లకు నష్టాలూ పెరుగుతున్నాయి.
136 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ధరలతో ఇంధనాన్ని విక్రయించడం వల్ల రిటైలర్లకు భారీగా నష్టాలు వస్తున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. నయారా ఎనర్జీ, జియో-బీపీ, షెల్ వంటి సంస్థలకు నష్టాలు భారీగా పెరిగాయని చెప్పాయి. తక్కువ ధరకు ఇంధనాన్ని విక్రయించే బదులు.. బంకులను మూసివేయడమే మంచిదనే యోచనలో ఈ సంస్థలు ఉన్నాయని వివరించాయి.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. గతేడాది నవంబర్ 4 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచలేదు. ఫలితాల తేదీ అయిన మార్చి 10 తర్వాత ధరలు పెరుగుతాయని భావించినా.. బడ్జెట్ రెండో విడత సమావేశాలు కారణంగా కేంద్రం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:Gold Bonds: పసిడి బాండ్లు దీర్ఘకాలంలో లాభమే