తెలంగాణ

telangana

ETV Bharat / business

లాక్​డౌన్​ ప్రభావంతో బడ్జెట్​ ఫోన్లకు భలే గిరాకీ - లాక్​డౌన్​ ప్రభావం

ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు తక్కువ ధరల్లోనే నాణ్యమైన స్మార్ట్‌ఫోన్‌ ఆశిస్తున్నందున, ఇందుకు అనుగుణంగా దేశీయ కంపెనీలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఫీచర్​ ఫోన్లు, బడ్జెట్ స్మార్ట్​ ఫోన్​లకు గిరాకీ పెరుగుతోంది. లాక్​డౌన్​ కారణంగా పెరిగిన డిమాండ్​కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచుతున్నాయి.

SMARTPHONES
ఫోన్లకు భలే గిరాకీ

By

Published : May 26, 2020, 7:53 AM IST

కరోనా వైరస్‌ దేశీయ మొబైల్‌ రంగంలో భారీ మార్పులు తెస్తోంది. లాక్‌డౌన్‌ వల్ల సెల్‌ఫోన్లు-టాబ్లెట్లు, అనుబంధ పరికరాల తయారీ, విక్రయాలు నిలిచిపోయి పరిశ్రమకు దాదాపు రూ.15,000 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. అయితే భౌతికదూరం జాగ్రత్తలతో పాటు నగదు డిజిటల్‌ లావాదేవీలు విస్తృతం కావడం, పిల్లలకు ఆన్‌లైన్‌ తరగతులు, ఉద్యోగులకు ఇంటి నుంచి పని, దృశ్య మాధ్యమ సమావేశాల కోసం సెల్‌ఫోన్‌ ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌/టాబ్లెట్‌ పీసీలతో పాటు ఇయర్‌ఫోన్‌లు, హెడ్‌ఫోన్‌లు, రికార్డింగ్‌ పరికరాల వంటి అనుబంధ పరికరాలకు గిరాకీ పెరిగింది.

మాటలు, వీడియోకాల్స్‌తో పాటు వాట్సాప్‌ సందేశాలకు గతంలో ఎక్కువగా మొబైల్‌ను వినియోగించేవారు. అప్పుడు కుటుంబానికి 1-2 ఫోన్లున్నా సరిపోయేది. ఇప్పుడు పెరిగిన అవసరాలకు అనుగుణంగా చిన్నారులకూ కొనుగోలు చేయాల్సి వస్తున్నందున భవిష్యత్తుపై కంపెనీలు ఆశావహంగా ఉన్నాయి.

బడ్జెట్​లో..

అయితే ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు తక్కువ ధరల్లోనే నాణ్యమైన స్మార్ట్‌ఫోన్‌ ఆశిస్తున్నందున, ఇందుకనుగుణంగా దేశీయ కంపెనీలు సన్నాహాలు చేసుకుంటున్నాయని ఇండియన్‌ సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) పేర్కొంటోంది.

స్మార్ట్‌ఫోన్‌ అన్ని ఆదాయ వర్గాల్లోనూ కుటుంబీకులందరి అవసరంగా మారుతోంది. పాఠశాల, కళాశాలల విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు, పరీక్షలు తప్పనిసరి కావడంతో పెద్ద తెర ఉండే టాబ్లెట్‌ పీసీలకూ గిరాకీ అధికమవుతోంది. వీటినే సానుకూలాంశంగా మార్చుకునేందుకు దేశీయ కంపెనీలు సిద్ధమవుతున్నాయి.

మరమ్మతులకు ప్రత్యామ్నాయంగా..

లాక్‌డౌన్‌ సమయంలో మరమ్మతుకు గురైన ఫోన్ల స్థానంలో, కొత్తగా కొనుగోలు చేసేవారు కూడా రూ.500-1000లోపు ఫీచర్‌ఫోన్లు, రూ.5000-10,000 లోపు స్మార్ట్‌ఫోన్లు ఎక్కువగా అడుగుతున్నారు. దేశీయ సంస్థలు ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

2025కు రూ.13 లక్షల కోట్ల విలువైన 100 కోట్ల సెల్‌ఫోన్లు దేశీయంగా తయారు చేస్తూ, ప్రపంచానికి కేంద్రంగా ఎదగాలన్న ప్రధాని మోదీ ఆకాంక్ష నెరవేరే పరిస్థితి ఉందని ఐసీఈఏ జాతీయ అధ్యక్షుడు పంకజ్‌ మొహింద్రో ‘ఈనాడు’తో చెప్పారు. మొబైల్‌ రంగంలో ఉద్యోగాల కోత లేదని, కార్యకలాపాలు పునరుద్ధరిస్తున్నందున, తాత్కాలిక కార్మికులకూ ఉపాధి పెరుగుతోందని తెలిపారు.

పూర్తిగా తయారైన సెల్‌ఫోన్లపై కస్టమ్స్‌ 20 శాతానికి పైగా విధిస్తున్న ప్రభుత్వం విడిభాగాలపైనా సుంకాలు విధిస్తోంది. ఫలితంగా దేశీయంగా విడిభాగాల తయారీ సంస్థలను కూడా నెలకొల్పుతున్నారు.

ఇప్పటికీ దిగుమతి అవుతున్న విడిభాగాలు

ఎల్‌సీడీ, స్పీకర్లు, మైక్‌లు, కెమెరాలెన్స్‌, పీసీబీ (ప్రింటెడ్‌ సర్క్యూట్‌బోర్డు)కి కావాల్సిన గ్రీన్‌బోర్డ్‌, చిప్‌సెట్లు, కొంతవరకు ప్లాస్టిక్‌ సామగ్రి

ఇవన్నీ ఇక్కడే తయారీ

  • ఛార్జర్లు, ఫోన్‌కేస్‌, బ్యాటరీలు, కొన్ని విడిభాగాలు, ప్యాకింగ్‌ వంటివి దేశీయంగా తయారు చేస్తున్నారు. మొబైల్‌ తెరకు వినియోగించే ఎల్‌సీడీని కూడా దేశీయంగా తయారు చేసేందుకు అక్టోబరు వరకు గడువు ఇచ్చారు.
  • కెమెరా లెన్స్‌ కోసం తిరుపతిలో ఏర్పాటుచేసిన ఎలక్ట్రానిక్స్‌ క్లస్టర్‌లో సన్నీ ఆప్టిక్స్‌ కంపెనీ ఏర్పాటైంది. దిగ్గజ కంపెనీలకు ఈ సంస్థే కెమేరా లెన్స్‌ సరఫరా చేస్తోంది.
  • చిప్‌సెట్‌ కంపెనీల్లో దిగ్గజమైన క్వాల్‌కామ్‌ అమెరికా కంపెనీ కాగా, వీటి పరీక్షలు హైదరాబాద్‌ కేంద్రంలో సాగుతున్నాయి. చిప్‌సెట్‌ల తయారీ మాత్రం తైవాన్‌, కొరియా, చైనాలలో సాగుతోంది. మరో పెద్ద కంపెనీ అయిన ఎంటీకే కూడా తైవాన్‌ కంపెనీయే.
  • మదర్‌బోర్డుల అసెంబ్లింగ్‌ చెన్నై, నోయిడా వంటి ప్రాంతాల్లో సాగుతోంది.
  • చైనా నుంచి బయటకు తరలుతాయని భావిస్తున్న కంపెనీలతో పాటు, తైవాన్‌-కొరియా సంస్థల భాగస్వామ్యంతో దేశీయంగా మొబైల్స్‌ తక్కువ ధరలో తయారు చేయడంపైనే దేశీయ కంపెనీలు దృష్టి సారిస్తున్నాయని సమాచారం.

జీఎస్‌టీ పెరిగినా..

దేశీయంగా మొబైల్స్ తయారీ

ఇప్పటివరకు 4జీబీ-6జీబీ ర్యామ్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్లు రూ.15,000-20,000 శ్రేణిలో ఎక్కువగా విక్రయమయ్యాయి. మొబైల్స్‌పై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ను 18 శాతానికి పెంచాక, కొన్ని కంపెనీలు ఫోన్ల ధరలను పెంచాయి. కరోనా సంక్షోభం నేపథ్యంలో, ప్రజల కొనుగోలు శక్తికి అనుగుణంగా ఇదే తరహా స్మార్ట్‌ఫోన్లను రూ.10,000లోపే అందించడం ద్వారా అమ్మకాలు పెంచుకోవచ్చన్నది దేశీయ సంస్థల ఉద్దేశంగా చెబుతున్నారు.

గతంలో వడ్డీలేని రుణ సదుపాయం అధిక మోడళ్లపై లభించేది. ఇప్పుడు ఉద్యోగాల భద్రతపైనా అనిశ్చితి ఏర్పడటంతో, రుణ సంస్థలు కూడా తమ వ్యూహాలు మార్చుకుంటున్నాయి. ఫలితంగా లాక్‌డౌన్‌ సడలించిన ప్రాంతాల్లో కూడా మొబైల్‌కు రుణ సదుపాయం లభించడం లేదని సమాచారం.

ABOUT THE AUTHOR

...view details