పూజ.. బయోటెక్నాలజీలో పీజీ, పీహెచ్‌డీ చేసింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహా ఎన్నో ప్రముఖ సంస్థల్లో బయోటెక్నాలజిస్ట్‌గా చేసింది. ఈమెది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్. పరిశోధనలో భాగంగా దేశంలోని ఎన్నో రాష్ట్రాలు తిరిగింది. ఎంఎస్‌సీలో ప్రాజెక్టును పుట్టగొడుగులపై చేసింది. అప్పుడే దీనిలో మంచి పోషక విలువలున్నాయన్న విషయమూ అర్థమైంది. అదే సమయంలో దేశంలో పోషకార లోపం, వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టడం కారణంగా ఏర్పడుతున్న వాతావరణ కాలుష్యం రెండూ ప్రధాన సమస్యలని తెలిసింది. దానికేదైనా సాయం చేయాలనుకుంది. కానీ కుదరలేదు.
puja dubey pandey : ఆమె చూపే 'పరిష్కారం'తో... పైసల వర్షం కురుస్తోంది! - telangana top news
చదువుకునేటప్పుడు ఆమెకు దేశంలో రెండు ప్రధాన సమస్యలు కన్పించాయి. పోషకాహార లోపం, వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టడం వల్ల ఏర్పడే కాలుష్యం. పూజా దూబే పాండే(puja dubey pandey) బయోటెక్నాలజీలో తన అనుభవంతో వాటికి పరిష్కార మార్గాన్ని కనిపెట్టింది. అదిప్పుడు ఆమెకు లక్షలు తెచ్చిపెడుతోంది. ఇంతకీ సంగతేంటంటే..
తర్వాత ఆమెకు పెళ్లయ్యి, కూతురు పుట్టింది. పాప ఆలనాపాలనా దగ్గరుండి చూసుకోవాలనుకుంది. అందుకోసం ఉద్యోగాన్ని వదిలేసి ఇండోర్‌కు చేరుకుంది. పాపకు సమయం కేటాయిస్తూనే తన అనుభవంతో ఏదైనా చేయాలనుకుంది. అప్పుడే పీజీలో తను చేసిన పుట్టగొడుగుల ప్రాజెక్ట్ గుర్తొచ్చింది. దాన్నే ప్రయత్నిద్దామనుకుంది. 2017లో బేటీ (బయోటెక్ ఎరా ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా) పేరిట సంస్థను స్థాపించింది. ఇంటి బేస్‌మెంట్‌ను ల్యాబ్‌గా మార్చుకుంది. మొదట పుట్టగొడుగుల విత్తనాలను తయారు చేసింది. రైతుల నుంచి వ్యవసాయ వ్యర్థాలను సేకరించి, తన బయోటెక్నాలజీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాటిపై తనే స్వయంగా పెంచడమూ ప్రారంభించింది. వాటి ప్యాకింగ్‌కీ పర్యావరణహిత పదార్థాలనే ఉపయోగించాలనుకుంది. పుట్టగొడుగులు పెరిగాక ఆ వ్యవసాయ వ్యర్థాలను డీ కంపోజ్ చేసి ఎకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ మెటీరియల్‌గా చేయడం ప్రారంభించింది.
‘పుట్టగొడుగుల్లో మంచి పోషకాలుంటాయి. చాలామంది దీన్ని మాంసాహారమనో, విషపూరితమనో భావించి తినరు. అందుకే పెంపకంతోపాటు వీటిపై అవగాహనా కల్పించేదాన్ని. రైతులకూ లాభదాయక మార్గమిది. దీంతో చాలామంది వీటిపై దృష్టిపెట్టడం మొదలుపెట్టారు. నేరుగా తినలేని వాళ్లకోసం పొడి రూపంలో అమ్మడం ప్రారంభించాను. వాటిని ఏ కూరలో అయినా వాడుకోవచ్చు’ అంటోంది పూజ. ఈమె ప్రాజెక్టు నచ్చి కేంద్ర ప్రభుత్వం కొంత మొత్తాన్ని ఇచ్చింది. వాటితో ఇతరులకూ ప్యాకింగ్ మెటీరియల్ చేసిపెడుతోంది. ఇప్పుడు తన ఆదాయం ఏడాదికి రూ. 15 లక్షల పైమాటే!