కరోనా వైరస్ వ్యాధి(కొవిడ్-19) నిరోధం కోసం కొవాగ్జిన్ టీకాపై ముమ్మర ప్రయోగాలు నిర్వహిస్తూనే, పెద్దఎత్తున టీకా డోసులు ఉత్పత్తి చేస్తోంది భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్. అంతేకాకుండా ఆ టీకాను దేశీయంగా సరఫరా చేయడం సహా ఇతర దేశాలకూ అందించడానికి సన్నద్ధమవుతోంది. 'కొవాగ్జిన్'పై మూడో దశ క్లినికల్ పరీక్షలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. పరీక్షలు పూర్తికాగానే టీకాకు అనుమతి రావడమే తరువాయి.. వెనువెంటనే విపణిలోకి విడుదల చేసేందుకు వీలుగా ఇప్పటికే కోటి డోసుల టీకా తయారు చేశారు. ప్రస్తుతం ఈ సంస్థకు ఏటా 30 కోట్ల డోసుల టీకా తయారు చేసే సామర్థ్యం ఉంది. తొలిదశలో దేశీయ అవసరాలకు 10 కోట్ల డోసుల టీకా సరఫరా చేయాలనేది కంపెనీ ఆలోచన. ‘టీకా డోసులు పెద్ద సంఖ్యలో సరఫరా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి.. రిస్కు తీసుకుని ఇప్పటికే టీకా తయారీ చేపట్టాం' అని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ జాయింట్ ఎండీ సుచిత్ర ఎల్ల బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మరో రెండు దేశాలకు టీకా సరఫరా చేసేందుకు వీలుగా ఇప్పటికే ప్రాథమిక సరఫరా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ఆ రెండు దేశాల పేర్లు వెల్లడించలేదు.
'కొవాగ్జిన్' టీకా అభివృద్ధి చేయడానికి 70 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.500 కోట్లు) వరకు ఖర్చు చేసినట్లు ఆమె వెల్లడించారు. టీకా బాగా పని చేస్తున్నట్లు ప్రాథమిక పరీక్షల్లో నిర్థారణ అయిందని, కనీసం 60 శాతం సామర్థ్యం దీనికి ఉన్నట్లు తేలిందని వివరించారు. (శ్వాస సంబంధ టీకాల సామర్థ్యం 50 శాతం పైగా ఉంటే, వినియోగానికి అనుమతులు లభిస్తాయి) 'తుది దశ మానవ ప్రయోగాల్లో ఇంకా అధిక సామర్థ్యం ఉన్నట్లు నిర్థారణ కావచ్చు' అని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ టీకాపై మూడో దశ క్లినికల్ పరీక్షలు 26,000 మంది వాలంటర్లీపై నిర్వహిస్తున్నారు. 'కొవాగ్జిన్' అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని ఇప్పటికే భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనర్ ఆఫ్ ఇండియా) కు దరఖాస్తు చేసింది. ఈ టీకా భద్రత, సమర్థత, ఇమ్యునోజెనిసిటీ... వంటి అంశాలను డీసీజీఐ నిపుణుల బృందం పరిశీలిస్తోంది.
దేశీయంగా పంపిణీకి సమర్థ వ్యవస్థ
ప్రస్తుత సన్నాహాలను పరిగణనలోకి తీసుకుంటే వచ్చే ఏడాది నుంచి రెండేళ్ల కాలంలో దేశంలో మూడో వంతు జనాభాకు కొవిడ్-19 టీకా ఇచ్చే అవకాశం ఉందని సుచిత్ర ఎల్ల ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద సార్వత్రిక టీకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మనదేశానికి కొవిడ్-19 టీకాను సమర్థంగా పంపిణీ చేయటం పెద్ద ఇబ్బంది కాకపోవచ్చని ఆమె ధీమా వ్యక్తం చేశారు. 'మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచాల్సిన పోలియో టీకానూ మనం సమర్థంగా పంపిణీ చేస్తున్నాం' అని గుర్తు చేశారు.
మూడో దశ క్లినికల్ పరీక్షలు
13,000లకు చేరిన వాలంటీర్ల సంఖ్య
తాము అభివృద్ధి చేస్తున్న కొవిడ్-19 వ్యాక్సిన్ కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ పరీక్షల కోసం ఇప్పటివరకు 13,000 మంది వాలంటీర్లను ఎంపిక చేసినట్లు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 26,000 మంది వాలంటీర్లపై మూడో దశ క్లినికల్ పరీక్షలు చేయనుంది. కొవాగ్జిన్ మొదటి, రెండో దశల్లో భాగంగా 1,000 మంది వాలంటీర్లపై క్లినికల్ పరీక్షలు జరిగాయి. వ్యాక్సిన్ సురక్షితంగా ఉండటంతో పాటు, ఇమ్యునోజెనిసిటీ ఫలితాలు సానుకూలంగా ఉన్నట్లు ఆ పరీక్షల్లో తేలినట్లు సంస్థ వెల్లడించింది. భారత ఔషధ పరిశోధనా మండలి (ఐసీఎంఆర్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ)తో కలిసి భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేసింది. అత్యంత శుభ్రపర్చిన, ఇనాక్టివేటెడ్ సార్స్-కోవ్2 వ్యాక్సిన్ కొవాగ్జిన్‌ను ఇప్పటివరకూ 30 కోట్ల వ్యాక్సిన్‌లను అత్యంత సురక్షితంగా ఉత్పత్తి చేసిన భారత్ బయోటెక్ బీఎస్‌ఎల్-3 బయోకంటైన్మెంట్ కేంద్రంలో ఉత్పత్తి చేస్తోంది. ఇంత పెద్దఎత్తున వ్యాక్సిన్ పరీక్షలను దేశంలో చేయడం ఇంతవరకూ జరగలేదని, వాలంటీర్ల సంఖ్య స్థిరంగా పెరగడం తమకు ఎంతో ఆనందాన్నిస్తోందని భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్ల పేర్కొన్నారు.
అమెరికాకు..
ఉమ్మడిగా అభివృద్ధి చేసేందుకు భారత్ బయోటెక్‌తో ఆక్యుజెన్ ఒప్పందం
'కొవాగ్జిన్'ను అమెరికా మార్కెట్ కోసం అభివృద్ధి చేసేందుకు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్‌తో అమెరికాకు చెందిన ఆక్యుజెన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఉమ్మడిగా టీకా అభివృద్ధి చేసేందుకు రెండు సంస్థలూ మంగళవారం ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ప్రకారం.. అమెరికాలో కొవాగ్జిన్ టీకాకు సంబంధించిన హక్కులు ఆక్యుజెన్‌కు ఉంటాయి. భారత్ బయోటెక్ సహకారంతో యూఎస్‌లో క్లినికల్ పరీక్షలు, రిజిస్ట్రేషన్, మార్కెటింగ్ తదితరాలకు ఆక్యుజెన్ బాధ్యత వహిస్తుంది. రాబోయే కొన్ని వారాల్లో ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని రెండు సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి. ఆక్యుజెన్‌కు ఉన్న వ్యాక్సిన్ల తయారీ, ఆర్‌అండ్‌డీ, రెగ్యులేటరీ సామర్థ్యాలు వినియోగించుకోనున్నారు. 'అమెరికా మార్కెట్లోకి కొవాగ్జిన్‌ను తీసుకొచ్చేందుకు రెండు సంస్థలూ కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. కరోనా నుంచి ప్రాణాలు కాపాడటానికి, సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి పరిష్కారాలను కనుక్కోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది' అని ఆక్యుజెన్ సహ వ్యవస్థాపకుడు, ఛైర్మన్, సీఈఓ శంకర్ ముసునూరి అన్నారు. మూడు దశల క్లినికల్ పరీక్షల్లో వ్యాక్సిన్ పనితీరు, భద్రత, ఇమ్యునోజెనిసిటీపై తాము సంతోషంగా ఉన్నామని వెల్లడించారు. కొవాగ్జిన్ కోసం అనేక దేశాల నుంచి ఆసక్తి వ్యక్తమవుతోందని భారత్ బయోటెక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్ల అన్నారు. కొవాగ్జిన్ అభివృద్ధి, క్లినికల్ పరీక్షల్లో విజయం సాధిస్తుండటం భారతదేశ వ్యాక్సినాలజీలో ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు. అమెరికా మార్కెట్లో దీన్ని విడుదల చేసేందుకు ఆక్యుజెన్‌తో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నామన్నారు.
ఇదీ చదవండి:వ్యాక్సిన్ వస్తే.. జీతం పెరుగుతుందిలే!