తెలంగాణ

telangana

ETV Bharat / business

Best future plan for Child: పిల్లలకు వీటిని బహుమతిగా ఇచ్చేయండి!

పిల్లలు ఆర్థికంగా ఎంతో వృద్ధిలోకి రావాలి.. ప్రతి తల్లిదండ్రుల ఆలోచన ఇలాగే ఉంటుంది. అందుకోసం వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఉన్నత చదువులు, వారి వివాహం.. కొత్త ఇల్లు కొనుగోలు.. ఇలా ప్రతి విషయంలోనూ వారికి అత్యున్నత జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటారు. అనుకోవడంతోనే సరిపోదు కదా.. ఆచరణలో ఇవన్నీ సాధ్యం కావాలంటే.. ఏం చేయాలి?

best future plan for child
best future plan for child

By

Published : Dec 10, 2021, 9:06 AM IST

Best future plan for child: ప్రతి సందర్భంలోనూ పిల్లలకు ఏదో ఒక బహుమతి ఇవ్వడం అందరికీ అలవాటే. కానీ, జీవితాంతం వారికి తోడుగా ఉంటూ.. రక్షణ కల్పించే వాటిని అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది. ప్రధానంగా వారి భవితకు భరోసా కల్పించేలా ఇవి ఉండాలి. అందుకు కొన్ని జాగ్రత్తలు.. కొన్ని ఏర్పాట్లూ తప్పనిసరి.

వీలునామా సిద్ధంగా

సంపద సృష్టించడం ప్రధానమే. ఆ సంపదను తన వారసులకు ఎలాంటి చిక్కులూ లేకుండా అందే ఏర్పాటు చేయడం మరింత ముఖ్యం అన్న సంగతి మర్చిపోకూడదు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ వీలునామా రాసి పెట్టడం మంచిది. ఇది ఒక వ్యక్తి తన తదనంతరం తన సంపద ఎవరికి చెందాలి అని తెలియజేసే చట్టబద్ధమైన ఒక పత్రం. మీకు కావాల్సిన వ్యక్తులకు సమస్య లేకుండా ఆస్తి బదలాయింపు జరిగేందుకు ఇది తోడ్పడుతుంది. జీవిత భాగస్వామి, పిల్లల పేరుమీద ఎక్కువ మంది దీన్ని రాస్తుంటారు. కొంతమంది తమకు సంబంధించిన దగ్గరి బంధువులకూ కొంత ఆస్తిని కేటాయిస్తూ వీలునామా తయారు చేస్తారు. వీలునామా రాయడంతోపాటు, దాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించడం వల్ల భవిష్యత్తులో కుటుంబ సభ్యుల మధ్య వివాదాలకు తావులేకుండా చూసుకోవచ్చు. వీలునామాను సందర్భానుసారంగా మార్చుకునే వీలుంటుంది. పిల్లలకు ఇచ్చే మొదటి ఆర్థిక బహుమతి వీలునామానే అన్న సంగతి గుర్తుంచుకోండి.

ఆరోగ్య బీమాలో

LIC policy child future plan: పిల్లలు పుట్టిన వెంటనే పూర్తి స్థాయి ఫ్యామిలీ ఫ్లోటర్‌ ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం మంచిది. వైద్య ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆరోగ్య బీమా లేకపోతే ఈ వ్యయాలను తట్టుకోవడం కష్టం. అనుకోని అనారోగ్యం వస్తే.. మంచి వైద్యం అందించడంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. నిర్ణీత వయసు రాగానే ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీ నుంచి వారిని సొంత వ్యక్తిగత పాలసీలోకి మార్చాలి. చిన్న వయసులోనే పాలసీ తీసుకుంటే.. వైద్య పరీక్షల అవసరం ఉండదు.

నిర్ణయాల్లో భాగస్వామ్యం

మీరు తీసుకుంటున్న ఆర్థిక నిర్ణయాలు.. వాటి ప్రభావం ఎలా ఉండబోతోంది అనే విషయాలను పిల్లల దగ్గర చర్చించడం మంచిదే. ఆర్థిక విషయాల్లో సొంతంగా ఆలోచించేందుకు ఇది ప్రేరణ కలిగిస్తుంది. వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలు ఎలా ఉండాలి.. వాటి వల్ల ప్రయోజనాలు ఇలా అన్నీ వారు అర్థం చేసుకోగలుగుతారు. మీ ఆస్తులు, అప్పుల గురించి తెలుసుకోవడం వల్ల ఆర్థికంగా తాము ఎలా ఉన్నామన్నదీ వారికి తెలుస్తుంది. ఏదైనా అనుకోనిది సంభవించినప్పుడు వారికి వీటిన్నింటిపైనా అవగాహన ఉంటుంది కాబట్టి, భయపడాల్సిన అవసరముండదు. ఆర్థిక విషయాల్లో పిల్లలను భాగస్వాములుగా చేయడం వల్ల.. వారికి వాస్తవ పరిస్థితి స్పష్టంగా తెలుస్తుంది.

రుణ భారం లేకుండా

అప్పు ఒక బాధ్యత. ఇది పిల్లలకు బదిలీ కాకూడదు. దీనివల్ల వారి ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. కొత్త రుణం ఏది తీసుకున్నా.. దాన్ని తిరిగి తీర్చే ఏర్పాటు చేసుకోవాలి. దానికోసం డబ్బు కేటాయించడం లేదా లోన్‌ కవర్‌ టర్మ్‌ పాలసీల్లాంటివి తీసుకోవడం అవసరం. వ్యక్తి మరణించినప్పుడు అతనికి సంబంధించిన రుణాలన్నీ ఈ బీమా పాలసీలే తీర్చేయాలి. అప్పు తీసుకున్నప్పుడు, సకాలంలో దాన్ని తీర్చేయాలి. స్తోమతకు మించి రుణాలు తీసుకోవడం సరికాదు. పిల్లలకు ఎలాంటి రుణ భారం లేకుండా చూసినప్పుడు.. వారు మీ సంపదను మరిన్ని రెట్లు పెంచేందుకు కృషి చేస్తారు.

ఇవే కాకుండా.. పదవీ విరమణ తర్వాత పిల్లల మీద ఆధారపడటం అనే ఆలోచన ఉండకూడదు. విశ్రాంత జీవితంలో ఆర్థిక అవసరాలకు ఉపయోగపడేలా పదవీ విరమణ ప్రణాళికలను వేసుకోవాలి. అందుకు తగిన పెట్టుబడులు పెట్టాలి. చిన్న వయసు నుంచే మదుపు చేసేలా పిల్లలను ప్రోత్సహించాలి. అప్పుడే వారు తొందరగా ఆర్థిక స్వేచ్ఛ సాధించగలుగుతారు.

ఆర్థిక రక్షణ

Financial Security: కుటుంబంలో ఆర్జించే వ్యక్తిపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు ఆ వ్యక్తి తప్పనిసరిగా జీవిత బీమా పాలసీ తీసుకోవాల్సిందే. ముఖ్యంగా పిల్లల భవితకు ఆర్థిక భరోసా కల్పించేందుకు దీని అవసరం ఎంతో ఉంటుంది. ఒక వ్యక్తి తాను సంపాదిస్తున్నన్ని రోజులూ కుటుంబ అవసరాలకు ఏ ఇబ్బందీ లేకుండా చూసుకుంటాడు. కానీ, దురదృష్టవశాత్తూ అతను దూరమైతే పరిస్థితులు తలకిందులవుతాయి. ఇలాంటి చిక్కులు రాకుండా చూసుకోవాలంటే తగిన మొత్తానికి టర్మ్‌ బీమా చేయించాలి. అనుకోని సంఘటనల వల్ల పిల్లల చదువులు, ఇతర అవసరాలకు ఏ ఇబ్బందీ లేకుండా దీనివల్ల సాధ్యమవుతుంది. బాధ్యతలతోపాటు టర్మ్‌ బీమా మొత్తమూ పెరగాలి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ఆర్థిక భరోసా కల్పించేలా చూడటమే పిల్లలకు ఇచ్చే రెండో కానుక.

రచయిత- అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌.కామ్‌

ఇదీ చూడండి:ఈ ఏడాది ట్విట్టర్​లో ఎక్కువ మందికి నచ్చిన పోస్ట్​ అదే..

ABOUT THE AUTHOR

...view details