తెలంగాణ

telangana

By

Published : Dec 3, 2020, 8:12 PM IST

ETV Bharat / business

పోంజి కుంభకోణంపై రంగంలోకి ఆర్​బీఐ

బంగాల్​లో పోంజి కుంభకోణంపై ఆర్​బీఐ దృష్టిసారించింది. 194 చిన్న, సూక్ష్మ స్థాయి చిట్​ఫండ్ సంస్థలపై దర్యాప్తు ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ విషయంపై బంగాల్ ప్రభుత్వాన్ని ఇదివరకే ఆర్​బీఐ అప్రమత్తం చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై తాజా విచారణ చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Before Bengal polls RBI to get active again on 194 small chit fund entities in Bengal
పోంజి కుంభకోణంపై రంగంలోకి ఆర్​బీఐ

శారదా గ్రూప్, రోస్ వ్యాలీ గ్రూప్ పోంజి కుంభకోణాలపై ఈడీ, సీబీఐ, ఎస్ఎఫ్ఐఓ(సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్) వంటి కేంద్ర సంస్థలు ఇప్పటికే ముమ్మర దర్యాప్తు చేస్తున్నాయి. తాజాగా ఆర్​బీఐకి చెందిన మార్కెట్ ఇంటెలిజెన్స్ వింగ్(ఎంఐడబ్ల్యూ) సైతం ఈ విషయంపై దృష్టిసారించింది. 2015 చివరి నుంచి బంగాల్​లో యాక్టివ్​గా ఉన్న 194 చిన్న, సూక్ష్మ స్థాయి చిట్​ఫండ్ సంస్థలపై దర్యాప్తు మొదలు పెట్టాలని యోచిస్తోంది.

ఈ సంస్థల విషయంలో 2016 నవంబర్​లోనే బంగాల్ ప్రభుత్వాన్ని ఆర్​బీఐ అప్రమత్తం చేసిందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో చిట్​ఫండ్ సంస్థల పూర్తి వివరాలను రాష్ట్రానికి పంపించినట్లు చెప్పారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందనే విషయంపై ఆర్​బీఐ తాజా విచారణ చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం వద్ద ఏదైనా అదనపు సమాచారం ఉందనే విషయంపైనా ఆర్​బీఐ ఆరా తీయనున్నట్లు వెల్లడించారు.

"రోస్​ వ్యాలీ గ్రూప్​తో పోలిస్తే ఈ 194 సంస్థలు.. పరిణామం, నిధుల సమీకరణ పరంగా చాలా చిన్నవి. కానీ సరైన పర్యవేక్షణ లేకపోతే ఈ సంస్థలే భారీ కుంభకోణానికి దారీతీసేంత పెద్దవిగా మారతాయి. 194 చిట్​ఫండ్ సంస్థల గురించి 2016 నవంబర్​ నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్​బీఐ అన్ని వివరాలు పంపించింది. సరైన చర్యలు తీసుకోకపోతే ఈ సంస్థలే శారదా, రోస్​ వ్యాలీల్లా భారీ ఆర్థిక కుంభకోణాలకు మాస్టర్​మైండ్​గా మారతాయని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుందని భావిస్తున్నాం."

-ఆర్​బీఐ అధికారి

ఈ సంస్థల్లో కొన్ని ఇప్పటికీ రహస్యంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని అధికారి వెల్లడించారు. లాభదాయక రిటర్నులు ఇస్తామని చెప్పి ప్రకటనలు ఇస్తున్నారని తెలిపారు.

"సామాజిక మాధ్యమాలలో, వివిధ పబ్లికేషన్లలో వచ్చే రకరకాల ప్రకటనలపై ఆర్​బీఐ మార్కెట్ ఇంటెలిజెన్స్ విభాగం కన్నేసి ఉంచుతుంది. దీనికి అందిన సమాచారం ప్రకారం కొన్ని సంస్థలు లాభదాయక రిటర్నులు ఇస్తామని అసంబద్ధ హామీలు ఇస్తున్నాయి. వీరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆర్​బీఐ నిర్ణయించింది."

-ఆర్​బీఐ అధికారి

అయితే బంగాల్​లో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ.. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుకుంటున్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలను రాష్ట్రంలోకి ప్రవేశించకుండా చేస్తున్నారు. ఎన్నికలు రాగానే ఈ ఏజెన్సీలను ఉపయోగించి ప్రత్యర్థులపై ఒత్తిడి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details