కుమార్ ఒక చిన్న పరిశ్రమ నిర్వహిస్తూ, మూడేళ్ల క్రితం గృహరుణం తీసుకున్నారు. కరోనా ప్రారంభమైనప్పటి నుంచీ వ్యాపారం సరిగా సాగకపోవడంతో గృహరుణానికి నెలవారీ వాయిదాలు చెల్లించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే, గత ఏడాది ఆర్‌బీఐ ఆరు నెలల పాటు రుణ మారటోరియం ప్రకటించడంతో ఎలాగో గండం నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత వ్యాపారం కాస్త కుదుటపడటంతో.. ఊపిరి పీల్చుకున్నారు. కానీ కొవిడ్-19 రెండో దశ విజృంభించడంతో మళ్లీ ఆదాయం తగ్గింది. 2 నెలలుగా గృహరుణం నెలవారీ వాయిదాలు చెల్లించడానికి ఇబ్బందులు పడుతున్నారు.. ఇప్పుడు చాలామంది చిరు వ్యాపారులు, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల నిర్వాహకులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు, చిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యే ఇది.
రుణాలకు సంబంధించి నెలవారీ వాయిదాలు చెల్లించేందుకు తమ బ్యాంక్ ఖాతా నుంచి 'ఆటో డెబిట్' ఇస్తుంటారు. ఇందువల్ల నెలవారీ కిస్తీమొత్తం, వేతన/ఆదాయం వచ్చే ఖాతా నుంచి సమయానికి వెళ్లిపోతుంటుంది. అయితే ఉద్యోగాలు పోయి/వేతనం తగ్గి/ఆదాయం రాక.. ఎంతోమంది బ్యాంకు ఖాతాల్లో సరిపడా నిల్వ లేనందున, రుణాలకు సంబంధించిన ఆటోడెబిట్ లావాదేవీలు విఫలం అవుతున్నాయి. నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (నాచ్) వివరాల ప్రకారం.. మే నెలలో మొత్తం 8.57 కోట్ల ఆటోడెబిట్ లావాదేవీలు జరగ్గా, అందులో 3.08 కోట్ల లావాదేవీలు విఫలమయ్యాయి. 2020 జూన్‌లో ఆటో డెబిట్ విఫల లావాదేవీలు దాదాపు 45శాతంపైగానే ఉన్నాయి. గత అక్టోబరు నుంచి కరోనా కేసులు తగ్గడం, ఆర్థిక వ్యవస్థ కొంత మేరకు గాడిన పడటంతో.. ఈ చెల్లింపుల వైఫల్యం తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మళ్లీ పెరిగాయి.
నగదు లేకపోతే
ప్రతి నెలా క్రమం తప్పకుండా చేసే చెల్లింపులు ఆటో డెబిట్ అయ్యేలా బ్యాంకులకు ఖాతాదారులు సూచనలు ఇచ్చే వీలుంది. ఈ చెల్లింపులను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఆధ్వర్యంలోని నాచ్ చూసుకుంటుంది. ఇందులో రుణ వాయిదాలే కాకుండా.. క్రెడిట్ కార్డు బిల్లులు, పెట్టుబడులు, బీమా పాలసీల చెల్లింపులు, టెలిఫోన్ బిల్లులు, ఇంటర్నెట్ ఛార్జీలు, కరెంటు, నీటి బిల్లులు ఇలా ఎన్నో ఉంటాయి. కొన్నిసార్లు సాంకేతిక కారణాల వల్ల ఖాతాలో నగదు ఉన్నప్పటికీ.. ఆయా లావాదేవీలు విఫలం కావచ్చు.
కుదుటపడేదాకా