విద్యుత్ వాహనాల (ఈవీ) తయారీకి మరిన్ని సంస్థలు ముందుకు వచ్చినప్పుడు.. పోటీతోపాటు, వినియోగదారుల్లో నమ్మకమూ పెరుగుతుంది. కొవిడ్-19 తర్వాత వాహన రంగానికి కొంత ఇబ్బంది ఎదురైనా.. ఈవీలకు మాత్రం ఇది సానుకూలంగానే మారిందని విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు తరుణ్ మెహతా తెలిపారు. నింగినంటుతున్న పెట్రోలు ధరలతో ఆందోళన చెందుతున్నవారు.. యువతరం విద్యుత్ వాహనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని 'ఈనాడు' ఇంటర్వ్యూలో తెలిపారు.
కొవిడ్-19 తర్వాత విద్యుత్ ద్విచక్ర వాహనాలకు ఆదరణ ఎలా ఉంది?
లాక్‌డౌన్ తర్వాత స్థానికంగా విడిభాగాల సరఫరా, ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడ్డాయి. గతంలో ప్రజా రవాణాను ఉపయోగించిన వారు ఇప్పుడు వ్యక్తిగత రవాణాకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది వాహన రంగానికి కలిసొచ్చే అంశం. యువత అయితే తమ వాహన అవసరాల కోసం విద్యుత్ వాహనాలనే చూస్తున్నారు. ఇప్పటికే బైక్‌లున్న వారూ, తోడుగా వీటిని కొనాలని చూస్తున్నారు.
సంప్రదాయ వాహనాలతో పోలిస్తే.. విద్యుత్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు అంతగా ఉండటం లేదు. ధరా ఎక్కువే. కారణం ఏమిటి?
కొత్తదనం అలవాటు కావడానికి కొన్నేళ్లు పడుతుంది. ఆ తర్వాత వృద్ధి కనిపిస్తుంది. 2019, 2020లో ఫేమ్-2 నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వాహన ఉత్పత్తిదారులు కొత్త, శక్తిమంత వాహనాల ఆవిష్కరణకు ప్రయత్నిస్తున్నారు. గత ఐదు నెలల్లో మేము 5 రెట్ల వృద్ధి సాధించాం. విద్యుత్ వాహనాల ధరలు తగ్గడానికి దీర్ఘకాలమే పట్టొచ్చు. ఈవీలకు సంబంధించి ప్రభుత్వ విధానాల్లో స్పష్టత రావాలి. ఈవీలను ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు పెరుగుతున్న కొద్దీ.. దేశీయంగా విడి భాగాల లభ్యత పెరిగి, ధరలు కొంత మేరకు తగ్గే అవకాశం ఉంది.
హీరో, హోండా, యమహా, టీవీఎస్‌లాంటి పెద్ద సంస్థలు విద్యుత్ వాహనాల ఉత్పత్తికి ఆలోచించి అడుగులు వేస్తున్నాయి. కొత్తగా వస్తున్న సంస్థలు ఈ పోటీలో ముందుంటున్నాయి. ఎందుకు?
బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ పేరుతో ఈవీలను అందుబాటులోకి తెచ్చాయి. సుజుకీ త్వరలోనే బర్గ్‌మ్యాన్‌కు విద్యుత్ వెర్షన్ తీసుకురానుంది. ఓలా స్కూటర్ జులైలో విడుదల కానుంది. పెద్ద సంస్థలు రావడం వల్ల మార్కెట్ బలోపేతం అవుతుంది. పెట్రో వాహనాలనే చూస్తే.. వినియోగదారులకు కావాల్సినన్ని మోడళ్లు, వివిధ ధరల వద్ద అందుబాటులో ఉన్నాయి. ఈవీలో ఉత్పత్తిదారులు పెరిగితే.. వినియోగదారులకు ఎంపిక అవకాశాలు, నమ్మకం- గిరాకీ పెరిగే వీలుంటుంది.
ఇదీ చదవండి:ఓలా ఈ-స్కూటర్ వచ్చేది ఎప్పుడంటే!
ఇదీ చదవండి:ఈవీ ఛార్జింగ్ స్టేషన్లతో 12 వేల ఉద్యోగాలు!
విద్యుత్ వాహనాల విభాగంలో ఏథర్ ఎనర్జీ స్థానం ఏమిటి? వినియోగదారుల అంచనాలు ఏ మేరకు అందుకుంటోంది? కొత్త పెట్టుబడులు పెట్టబోతున్నారా?
సంప్రదాయ వాహన ఉత్పత్తిలో మాకు అనుభవం లేకపోయినా.. నాణ్యమైన ఉత్పత్తులను అందించడం ద్వారా మేము ఇతరులకన్నా భిన్నంగా నిలబడ్డాం. ప్రస్తుతం తమిళనాడులోని హోసూరులో ఉన్న మా ఉత్పత్తి కేంద్రం నుంచి ఏడాదికి 1,10,000 స్కూటర్లు, 1,20,000ల బ్యాటరీ ప్యాక్‌లను ఉత్పత్తి చేయగలం. దేశీయ అవసరాలకు ఇది సరిపోతుందని భావిస్తున్నాం. రాబోయే ఐదేళ్లలో దాదాపు రూ.635 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నాం. ప్లాంటు విస్తరణ, ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు ఈ పెట్టుబడి వినియోగిస్తాం. 4,000 మంది ఉద్యోగులను ఈవీ ఉత్పత్తికి అవసరమైన నైపుణ్యాలతో సిద్ధం చేయడమూ మా ప్రణాళికలో భాగమే. ప్రస్తుతం 18 నగరాల్లో 120 ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. 27 నగరాల్లో వీటిని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నాం. ఎంపిక చేసిన నగరాల్లో ఏథర్ ఎనర్జీ ఎక్స్‌పీరియెన్స్ కేంద్రాలు నెలకొల్పి, ఏథర్ 450ఎక్స్‌ను అందుబాటులోకి తేవడం ఈ ఏడాది ప్రధాన లక్ష్యం. హీరో మోటో కార్ప్ మా సంస్థలో తొలి నుంచే పెట్టుబడి పెడుతోంది. ఆ సంస్థ ఎన్నో విలువైన సూచనలు అందిస్తోంది.
ఇదీ చదవండి:ఎలక్ట్రానిక్ వాహనాల కోసం ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్
ఇదీ చదవండి:ప్యూర్ ఈవీ అంకుర సంస్థ నుంచి కొత్త బైక్..
విద్యుత్ వాహనాల ప్రోత్సాహానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది?
ప్రజల్లో విద్యుత్ వాహనాలపై అవగాహన పెంచడంలో ప్రభుత్వం కీలకపాత్ర పోషిస్తోంది. కంపెనీలు అత్యంత నాణ్యమైన, సమర్థమైన వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఫేమ్-2 విధానంతో ప్రోత్సహిస్తోంది. ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తోంది. ఇంట్లో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటూ ఇందులో కీలకమే. సాధారణ వాహనదారులు.. తమ వాహనాలకు ఇంట్లోనే ఛార్జింగ్ చేసుకునేందుకు ఇష్టపడతారు. గృహసముదాయాలు, అపార్ట్‌మెంట్లు నిర్మించేటప్పుడు ఛార్జింగ్ స్టేషన్లు, పార్కింగ్ ప్రాంతాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనే నిబంధనలు తీసుకురావాలి.
పెట్రోలు ధరలు పెరుగుతుండటం వల్ల విద్యుత్ వాహనాలకు భవిష్యత్తులో గిరాకీ పెరుగుతుందా?
పెట్రోలు ధరలు పెరుగుతున్నప్పటి నుంచీ విద్యుత్ స్కూటర్లకు గిరాకీ పెరగడం గమనిస్తున్నాం. చాలామంది వినియోగదారులు కొత్త వాహనాలను కొనేటప్పుడు ఈవీల గురించి ఆలోచిస్తున్నారు. పెట్రోలు వాహనాలతో పోలిస్తే.. ఈవీలు కాస్త ధర ఎక్కువే అయినప్పటికీ.. దీర్ఘకాలంలో అందే ప్రయోజనాలతో పోల్చి చూసుకోవాలి. విద్యుత్ వాహనాలను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు లీజుకు ఇవ్వడం, బైబ్యాక్‌లాంటి వాటిని ప్రవేశపెట్టాం.
ఇదీ చదవండి:రెండు సెకన్లకు ఒక ఈ-స్కూటర్ తయారీ!
'కరోనా ఉన్నా.. ఏసీలకు తగ్గని గిరాకీ'