ఆనంద్ మహీంద్ర నిత్యం బిజీబిజీగా ఉండే వ్యాపారవేత్త. మహీంద్ర సంస్థల ఛైర్మన్. ఎంత తీరిక లేకుండా ఉన్నా.. ట్విట్టర్లో మాత్రం చాలా చురుకుగా ఉంటారు. సామాజిక విషయాల నుంచి సరదా సంఘటనల వరకు.. స్ఫూర్తిదాయక అంశాల నుంచి కళాత్మక వీడియోల వరకు... అన్నింటినీ ట్విట్టర్లో పంచుకుంటారు. ఆయన ట్వీట్లతో సెలబ్రిటీలైన సామాన్యులు ఉన్నారు.
ట్వీట్లతో మహీంద్ర ఆలోచింపజేస్తారు. హాస్యం పండిస్తారు. అలాంటి ఆయన ఈ మధ్య కాలంలో ఓ ఫొటో కోసం తెగ వెతికేశారు. ఆ ఫొటో ఎవరిది? ఈ మధ్యకాలంలో ఆయన చేసిన ఆసక్తికర ట్వీట్లు ఏవి..?
ఆ ఫొటో దొరికితే స్ర్కీన్సేవర్గా పెట్టుకుంటా...
ఈ నెల ఆరో తేదీన కేరళలోని త్రిస్సుర్లో ఓ పదో తరగతి విద్యార్థిని ఫైనల్స్ పరీక్షలు రాసేందుకు గుర్రంపై స్వయంగా స్వారీ చేస్తూ వెళ్లింది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయింది. ఆ వీడియోను ఆనంద్ మహీంద్ర చూశారు. ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ అమ్మాయిని అభినందించారు.
"త్రిస్సుర్లో ఎవరికైనా ఈ అమ్మాయి తెలుసా? ఆ అమ్మాయి, ఆమె గుర్రం ఫొటోలు నాకు కావాలి. నేను స్క్రీన్సేవర్గా పెట్టుకుంటా. ఆమె నా హీరో. ఆమె పాఠశాలకు వెళుతున్న విధానం, పట్టుదల చూస్తే భవిష్యత్తులో సమస్యలపై పోరాడేందుకు నాలో ఆశావాదం పెరుగుతోంది."
-- ఆనంద్ మహీంద్ర ట్వీట్
ఈ ట్వీట్‌తో ఆ బాలిక మరింత ఖ్యాతిగాంచింది. వేల మంది ఆయన ట్వీట్‌కు స్పందించారు. సుబిన్ అనే వ్యక్తి ఆయనకు మెయిల్ ద్వారా కృష్ణ అనే ఆ అమ్మాయి ఫొటో పంపారు.
"త్రిస్సుర్లో పరీక్ష రాసేందుకు పాఠశాలకు గుర్రంపై వెళ్లిన కృష్ణ అనే స్ఫూర్తిదాయక విద్యార్థిని వీడియో గురించి నేను కొంతకాలం క్రితం ట్వీట్ చేశా. స్క్రీన్సేవర్గా పెట్టుకునేందుకు ఫొటో కావాలని అడిగా. మెయిల్ ద్వారా ఇప్పుడు ఫొటో అందుకున్నా. సుబిన్‌కు ధన్యవాదాలు."
-- ఆనంద్ మహీంద్ర ట్వీట్
రాజకీయ సభలో ఒకేఒక్కడు..