తెలంగాణ

telangana

ETV Bharat / business

మల్టీ క్యాప్‌..ఫ్లెక్సీ క్యాప్‌..పెట్టుబడికి ఏది మేలు? - stock market

స్టాక్​ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్ల ద్వారా మదుపు చేసే వారు ఎక్కువగా మల్టీ క్యాప్​ ఫండ్లను ఎంచుకుంటారు. అయితే ప్రస్తుతం నిబంధనల్లో మార్పులు రావడం వల్ల దీనిని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నిబంధనల్లో వచ్చిన మార్పులు ఏమిటి? మదుపరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మొదలైన వాటిని వివరిస్తూ ప్రత్యేక కథనం.

siri.. multi cap
మల్టీ క్యాప్‌..ఫ్లెక్సీ క్యాప్‌..పెట్టుబడికి ఏది మేలు?

By

Published : Feb 19, 2021, 11:13 AM IST

స్టాక్‌ మార్కెట్లో ఏదో ఒక రకం షేర్లలో పెట్టుబడికే పరిమితం కాకుండా రెండు, మూడు తరగతులకు చెందిన షేర్లపై మదుపు చేస్తే నష్టభయం తగ్గుతుంది. అధిక లాభాలూ ఆర్జించే అవకాశం ఉంటుందని మదుపరుల విశ్వాసం. అందుకే లార్జ్‌ క్యాప్‌తోపాటు , మిడ్, స్మాల్‌ క్యాప్‌ షేర్లలో సందర్భాన్ని బట్టి ఆయా కంపెనీల పనితీరును విశ్లేషించి, మదుపు చేస్తుంటారు. ఇదే పనిని కొందరు మ్యూచువల్‌ ఫండ్ల ద్వారా చేస్తుంటారు. ఇందుకు మల్టీ క్యాప్‌ ఫండ్లను ఎంచుకుంటారు. కానీ, నిబంధనల్లో మార్పులు రావడం వల్ల ఈ వ్యూహాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం వచ్చింది. అవేమిటి? ప్రస్తుతం ఏం చేయాలి అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మల్టీ క్యాప్‌ ఫండ్లను నిర్వహించే ఫండ్‌ మేనేజర్లు తమ అజమాయిషీలో ఉన్న నిధిని ప్రధానంగా లార్జ్, మిడ్‌ క్యాప్‌ షేర్లలో పెట్టుబడులకు పరిమితం చేసేవారు. స్మాల్‌ క్యాప్‌ షేర్లను విస్మరించేవారు. కానీ, ఈ పద్ధతి మారాలని, మల్టీ క్యాప్‌ ఫండ్లు కనీసం 25 శాతం పెట్టుబడులను స్మాల్‌ క్యాప్‌ షేర్లకు కేటాయించాలని నిర్దేశిస్తూ, సెబీ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. మల్టీ- క్యాప్‌ పండ్ల పెట్టుబడులకు సంబంధించి 25- 25- 25 నిబంధన తీసుకురావటం, ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్లు అనే ఒక కొత్త తరగతిని సృష్టించింది. అదే సమయంలో ఈ నిబంధనలు పాటించటం ఇష్టం లేని ఫండ్లు, ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్లుగా మారేందుకు అవకాశం కల్పించింది. దీంతో చాలా మల్టీ క్యాప్‌ ఫండ్లు, ఇప్పుడు ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్లుగా పేరు మార్చుకుంటున్నాయి.

ఇంకేం మార్పులు వచ్చాయంటే..

  • ఇంతకాలం మల్టీ క్యాప్‌ ఫండ్లు, ప్రధానంగా లార్జ్‌ క్యాప్‌ పెట్టుబడులకు పరిమితం అయ్యాయి. అందువల్ల వాటికి ఇప్పుడు ఒక్కసారిగా 25- 25- 25 నిబంధన పాటించటం కష్టసాధ్యంగా మారింది. ముఖ్యంగా స్మాల్‌ క్యాప్‌ తరగతి షేర్లకు కనీసం 25 శాతం పెట్టుబడులను కేటాయించటం కుదరని పరిస్థితి. అందుకే అవి ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్లుగా మారిపోవటానికి సిద్ధపడ్డాయి. ఫలితంగా సెబీ కొత్త నిబంధనల ప్రకారం తమ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో మార్చాల్సిన అవసరం లేకుండా పోతోంది.
  • కొన్ని ఫండ్‌ పథకాలు మల్టీ క్యాప్‌ ఫండ్లుగా కొనసాగటానికి సిద్ధమయ్యాయి. ఇలాంటి వాటిల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీక్యాప్‌ ఫండ్‌ ముఖ్యమైనది. ఈ ఫండ్‌ పెట్టుబడులు దాదాపు 72 శాతం లార్జ్‌ క్యాప్‌ షేర్లలో ఉన్నాయి. మిడ్‌ క్యాప్‌లో 16 శాతం, స్మాల్‌ క్యాప్‌లో 9 శాతం పెట్టుబడులు పెట్టింది. కొత్త నిబంధనల ప్రకారం లార్జ్‌ క్యాప్‌ పెట్టుబడులు తగ్గించి, మిడ్, స్మాల్‌ క్యాప్‌ షేర్లకు కనీసం 25 శాతం చొప్పున పెట్టుబడులు మళ్లించటానికి ఈ ఫండ్‌ సిద్ధపడింది. అదే విధంగా నిప్పాన్‌ ఇండియా మల్టీ క్యాప్‌ ఫండ్‌ యథాతథంగా కొనసాగుతోంది.
  • ఈ నేపథ్యంలో మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు కొత్త నిబంధనల ప్రకారం మళ్లీ కొత్తగా మల్టీ క్యాప్‌ పథకాలను ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో స్మాల్‌ అండ్‌ మిడ్‌ క్యాప్‌ షేర్లకు స్టాక్‌ మార్కెట్లో ఆకర్షణ ఏర్పడింది. అందువల్ల మొదటి నుంచీ 25- 25- 25 పెట్టుబడుల సూత్రం ప్రకారం మొదటి నుంచీ పెట్టుబడులు పెట్టే వెసులుబాటుతో మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు కొత్త మల్టీ క్యాప్‌ పథకాల ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్లు) చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
    ఫ్లేక్సీ క్యాప్​ ఫండ్ల వివరాలు

మదుపు కొనసాగించాలా?

ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్లుగా మారిన పథకాల్లోనే తమ పెట్టుబడులు కొనసాగించాలా? వేరే వాటిని ఎంచుకోవాలా..? అనే సందేహం మదుపరుల్లో తలెత్తుతోంది.

  • పెట్టుబడి పెట్టిన మల్టీ క్యాప్‌ పథకం, ఇప్పుడు ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్‌గా మారినప్పటికీ మదుపరులు కంగారు పడవలసిన పనిలేదు. సంబంధిత పథకం పోర్ట్‌ఫోలియో మెరుగ్గా ఉండి, మంచి లాభాలు ఆర్జిస్తుంటే..దాన్లోనే కొనసాగవచ్చు.
  • ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్లకు సంబంధించి ఫండ్‌ మేనేజర్‌ సత్తా ఎంతో ముఖ్యం. వీటిని ఒక రకంగా యాక్టివ్‌లీ మేనేజ్డ్‌ పథకాలుగా చెప్పొచ్చు. కంపెనీల ఎంపిక విషయంలో ఫండ్‌ మేనేజర్‌కు ఎంతో స్వేచ్ఛ ఉంటుంది. ఒక్కోసారి సరిగా ఎంచుకోవచ్చు, మరోసారి తప్పటడుగు వేయొచ్చు. దాని ప్రభావం ఆ పథకం పనితీరుపై పడుతుంది. అందువల్ల ఫండ్‌ మేనేజర్‌ సత్తాను బట్టి ఈ ఫండ్లలో ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్లలో కొనసాగాలా.. వద్దా అనే అంశాన్ని నిర్ణయించుకోవాలి.
  • మదుపరులకు ఇప్పటికే లార్జ్‌ క్యాప్, మిడ్‌ క్యాప్, స్మాల్‌ క్యాప్‌ విభాగాలకు చెందిన ఫండ్‌ పథకాల్లో పెట్టుబడులు ఉంటే, అప్పుడు ప్రత్యేకంగా మరొక మల్టీ క్యాప్‌ను వెతుక్కోవలసిన పనిలేదు.
  • మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఈక్విటీ షేర్లలో పెట్టుబడి అధిక నష్టభయంతో కూడుకున్న అంశం అనేది తెలిసిన విషయమే. అదే సమయంలో దీర్ఘకాలంలో ఎంతో ఆకర్షణీయమైన ప్రతిఫలాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది. అందువల్ల తమ పెట్టుబడి లక్ష్యాల (ఇన్వెస్ట్‌మెంట్‌ గోల్స్‌) ప్రకారం ఫ్లెక్సీ క్యాప్‌గా మారిన మల్టీ క్యాప్‌ ఫండ్స్‌లో తమ మదుపు కొనసాగించాలా.. లేక ఉపసంహరించి మరొక పథకంలోకి మారాలా అనే విషయాన్ని పరిశీలించాలి.

ఏమిటి వ్యత్యాసం?

  • లార్జ్, మిడ్, స్మాల్‌ క్యాప్‌ తరగతికి చెందిన ఈక్విటీ షేర్లలో పెట్టుబడి పెట్టే వాటిని మల్టీ క్యాప్‌ ఫండ్లుగా పరిగణిస్తారు. గతంలో ఫండ్‌ మేనేజర్‌ తన ఇష్టానుసారం ఈ మూడు విభాగాలకు చెందిన కంపెనీలను ఎంచుకొని పెట్టుబడి పెట్టే వీలుంది. కానీ, ఈ మూడింటికీ కనీసం 25 శాతం చొప్పున పెట్టుబడి కేటాయించాలని సెబీ గత ఏడాదిలో నిర్దేశించింది. దీన్ని 25- 25- 25 రూల్‌ అనీ అంటున్నారు.
  • గతంలో మల్టీ క్యాప్‌ ఫండ్లకు వర్తించిన నిబంధనలే ఇప్పుడు ఫ్లెక్సీ- క్యాప్‌ ఫండ్లకు నిర్దేశించారు.

ఇదీ చదవండి :ఎల్​ఐసీ ఐపీఓకు మార్గం సుగమం

ABOUT THE AUTHOR

...view details