Amazon profit record: అమెరికా చరిత్రలో ఒక్కరోజు వ్యవధిలో అత్యధిక మార్కెట్ విలువను జోడించుకున్న సంస్థగా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ రికార్డు నెలకొల్పింది. త్రైమాసిక ఫలితాలు మదుపర్లను మెప్పించడంతో కంపెనీ షేర్లు శుక్రవారం 13.5 శాతం మేర లాభపడ్డాయి. దీంతో అమెజాన్ మార్కెట్ విలువ ఒకేరోజులో 190 బిలియన్ డాలర్లు (రూ.14.18 లక్షల కోట్లు) ఎగబాకి 1.6 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా ఒకరోజు వ్యవధిలో అత్యధిక విలువను కోల్పోయి రికార్డు సృష్టించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
అమెజాన్ తాజాగా టెస్లా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. జనవరి 28న వెలువడిన త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించడంతో టెస్లా షేర్లు ఆరోజు భారీగా ర్యాలీ అయ్యాయి. ఒక్క రోజులో 181 బిలియన్ డాలర్ల అదనపు మార్కెట్ విలువను కంపెనీ సొంతం చేసుకుంది. తాజాగా ఈ రికార్డును అమెజాన్ అధిగమించింది. త్రైమాసిక ఫలితాలు మెప్పించడం, అమెరికాలో ప్రైమ్ సభ్యత్వ ధరలను పెంచనున్నట్లు ప్రకటించడమే అమెజాన్ షేర్ల ర్యాలీకి కారణం.