కొవిడ్ వల్ల బీమా ప్రాధాన్యం అందరికీ తెలిసింది. ఆరోగ్య బీమా అవసరమనే అంశాన్ని ప్రతి ఒక్కరికి కరోనా మహమ్మారి తెలియజేసింది. కొత్తగా వస్తోన్న ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని బీమా సంస్థలు ఎప్పటికప్పుడు పాలసీల్లో తగిన మార్పులు చేస్తున్నాయి. ఎక్కువ వ్యాధులకు బీమా అందించే విధంగా.. పాలసీ తీసుకోవాలనుకుంటే కొత్త పాలసీ కొనాల్సిన అవసరం లేకుండా.. ఉన్న ఆరోగ్య బీమా పాలసీని పోర్ట్ చేయించుకోవచ్చు.
2011లో ఆరోగ్య బీమా పాలసీ పోర్టబిలిటీకి భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) అనుమతి ఇచ్చింది. పోర్టబిలటీ ద్వారా పాలసీదారుడు ప్రస్తుతం ఉన్న ఆరోగ్య బీమా పాలసీని కొత్త దానికి లేదా వేరే బీమా సంస్థకు మార్చుకోవచ్చు.
ఎలా?
ఆరోగ్య బీమా పోర్టబిలిటీ కేవలం పాలసీ రిన్యూవల్ సమయంలోనే చేసుకోవాల్సి ఉంటుంది. పాలసీ మధ్యలో ఇది వీలు కాదు. పాలసీ గడువు ముగిసే కంటే 45 నుంచి 60 రోజుల మధ్య పోర్టబిలిటీ కావాలనుకుంటున్న వారు నూతన బీమా సంస్థను సంప్రదించాలి.
సేవలు సరిగా లేకపోవటం, చికిత్స సమయంలో వినియోగదారుడు భరించాల్సిన కో-పేమెంట్, వ్యాధికి సంబంధించిన చికిత్సకు ఉండే గరిష్ఠ పరిమితి లాంటి విషయాల్లో అంసతృప్తి.. కుటుంబసభ్యుల సంఖ్యలో మార్పు, కవరేజి పెంచుకోవాలనుకోవటం, క్యాష్‌లెస్ చికిత్స తదితర కారణాల వల్ల వినియోగదారులు పోర్టబిలిటీకి మొగ్గు చూపుతుంటారు. పోర్టబిలిటీ ప్రక్రియ ఇటీవలి కాలంలో సులభతరంగా మారిందని, ఆన్‌లైన్ ద్వారా తక్కువ పేపర్ వర్క్‌తో దీన్ని పూర్తి చేయవచ్చని బీమా ప్రతినిధులు చెబుతున్నారు.
"ఆరోగ్య బీమా పోర్టబిలిటీ చేయించుకోవాలనుకుంటున్న వారు రిన్యూవల్ కంటే 45 నుంచి 60 రోజుల ముందు కొత్త బీమా సంస్థను సంప్రదించాలి. అక్కడ పోర్టబిలిటీ దరఖాస్తు నింపి పాత పాలసీ వివరాలు అందించాలి. ప్రస్తుతం ఉన్న బీమా సంస్థలో కవరేజీ తక్కువుండటం, వేరే వాటి కంటే ఫీచర్లు తక్కువుండటం తదితర వాస్తవ కారణాలతో సంతృప్తిగా లేనట్లయితేనే పోర్టబిలిటీ తీసుకోవాలి" - నవల్ గోయల్, సీఈఓ, పాలసీ ఎక్స్.