Airtel to invest Rs 1.17 lakh crore: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ రాబోయే ఐదేళ్లలో రూ. 1.17 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. తన అనుబంధ సంస్థలైన ఇండస్ టవర్స్, ఎన్‌ఎక్స్‌ట్రా , భారతీ హెక్సాకామ్‌తో ఆ మేరకు వ్యాపార లావాదేవీలను నిర్వహించనున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఎయిర్‌టెల్ పేర్కొంది. మరోవైపు ఫిబ్రవరి 26న ఎయిర్‌టెల్ బోర్డు అసాధారణ సమావేశం (ఈజీఎం) కానుంది.
ఇటీవల రూ. 7,500 కోట్లకు కంపెనీలో 1.25 శాతం వాటాలను గూగుల్‌కు విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ లావాదేవీకి బోర్డు ఆమోదం పొందడం కోసం ఈ సమావేశం నిర్వహిస్తోంది.
ఈజీఎం నోటీసు ప్రకారం.. రాబోయే ఐదేళ్లలో వెచ్చించబోయే మొత్తంలో ఒక్క ఇండస్ టవర్స్ కోసం రూ. 88వేల కోట్లు ఎయిర్‌టెల్ ఖర్చు చేయనుంది. డేటా సెంటర్ సంస్థ అయిన ఎన్‌ఎక్స్‌ట్రా నుంచి సేవలకు గానూ రూ.15 వేల కోట్లు, భారతీ హెక్సాకామ్‌తో లావాదేవీలకు రూ.14వేల కోట్లు ఖర్చు పెట్టనుంది. ఈ మూడింట్లో టవర్స్‌పైనే ఎక్కువ మొత్తం ఎయిర్‌టెల్ వెచ్చించనుంది.