కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, ఐరోపాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ కారణంగా ప్రపంచ ఆర్థికానికి దాదాపు 4.1 ట్రిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేసింది ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు-ఏడీబీ). ఇది ప్రపంచవ్యాప్త రాబడిలో దాదాపు 5 శాతమని విశ్లేషించింది.
ఈ నష్టతీవ్రత చాలా తక్కువేనని.. ఆర్థిక, సామాజిక సంక్షోభం, విద్య, ఆరోగ్య రంగాలపై దీర్ఘకాలిక ప్రభావాన్ని ఇందులో మినహాయించినట్లు ఏడీబీ తెలిపింది. అయితే... స్వల్పకాలంలోనే ఈ నష్టాన్ని 2 ట్రిలియన్ డాలర్లకు తగ్గించే అవకాశాలున్నాయని వెల్లడించింది మనీలా కేంద్రంగా నడిచే ఏడీబీ.
''ప్రస్తుత సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం పడనుందనే మదుపరుల భయాలతో స్టాక్మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. అయితే.. కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు ఉద్దీపన చర్యలను ప్రకటిస్తుండటం సానుకూలాంశం.''
-ఏడీబీ
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 10 లక్షలు దాటిన తరుణంలో ఈ హెచ్చరికలు చేసింది ఏడీబీ. బిలియన్ల మంది ప్రజలు ఇంటికే పరిమితమవుతుండటం కారణంగా.. ఆర్థిక వ్యవస్థలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.