తెలంగాణ

telangana

ETV Bharat / business

బ్లాక్‌ ఫంగస్‌ ఔషధ ఉత్పత్తికి 11 కంపెనీలు!

బ్లాక్​ ఫంగస్​ చికిత్స కోసం వినియోగిస్తున్న యాంపొటెరిసిన్‌ బి ఇంజెక్షన్‌ ఉత్పత్తికి మరో ఐదు సంస్థలకు కేంద్రం అనుమతించింది. ఇప్పటికే ఆరు కంపెనీలు ఈ ఔషధాన్ని తయారు చేస్తున్నాయి.

black fungus medicine, amphotericin b injection
బ్లాక్​ ఫంగస్

By

Published : May 21, 2021, 7:28 AM IST

బ్లాక్‌ ఫంగస్‌..కొవిడ్‌-19 నుంచి కోలుకున్న బాధితులను భయబ్రాంతులకు గురిచేస్తున్న వ్యాధి. సాంకేతికంగా మ్యూకోమైకోసిస్‌ అని పిలిచే ఈ వ్యాధి ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు బలితీసుకుంది. ఇంకెంతోమంది దీని బారినపడి చికిత్స పొందుతున్నారు. దీన్ని అదుపు చేయడానికి వైద్యులు ప్రధానంగా లిపోసోమల్‌ యాంపొటెరిసిన్‌ బి ఇంజెక్షన్‌ను బాధితులకు ఇస్తున్నారు. ఈ ఔషధాన్ని ఇప్పటి వరకు ప్రధానంగా ఫంగల్‌ ఇన్ఫెక్షన్లను అదుపు చేయడానికి వినియోగిస్తున్నారు. ఇప్పటికే 6 కంపెనీలు ఈ ఔషధాన్ని తయారు చేస్తున్నాయి. బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు ఉపశమనం కలిగిస్తున్నందున, మరో 5 కంపెనీలకు 3 రోజుల్లోనే అనుమతి ఇచ్చినట్లు కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. ఇప్పటికే ఈ ఔషధాన్ని ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు, సామర్థ్యాన్ని పెంచుతున్నాయని, త్వరలోనే కొరత తీరుతుందని వివరించారు. నాట్కో ఫార్మా, అలెంబిక్‌, లైకా ల్యాబ్స్‌, గుఫిక్‌ బయోసైన్సెస్‌, ఎంక్యూర్‌ ఫార్మా కంపెనీలకు ఇటీవల అనుమతి ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు.

ఇటీవల కాలంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు పెరిగిన ఫలితంగా ఈ మందుకు ఎక్కడలేని గిరాకీ ఏర్పడింది. మార్కెట్లో దొరకకపోవడం సహా బ్లాక్‌మార్కెటింగ్‌ కూడా జరుగుతోంది. గరిష్ఠ విక్రయ ధర కంటే రెండు, మూడు రెట్లు అధికంగా చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోందని బాధితుల బంధువులు వాపోతున్నారు. ప్రస్తుతం మైలాన్‌, బీడీఆర్‌ ఫార్మా, సిప్లా, సన్‌ ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీస్‌, అబాట్‌ ఇండియా, భారత్‌ సీరమ్స్‌ అండ్‌ వ్యాక్సిన్స్‌ లిమిటెడ్‌ వంటి కంపెనీలు ఈ ఔషధాన్ని తయారు చేస్తున్నాయి. కానీ ప్రస్తుత డిమాండ్‌కు.. ఈ కంపెనీల ఉత్పత్తి సరిపోవడం లేదు. 6 లక్షల ఇంజెక్షన్లను దిగుమతి చేసుకునేందుకు భారత కంపెనీలు ఆర్డర్లు కూడా పెట్టాయని మంత్రి తెలిపారు. లిపోసోమల్‌ యాంపొటెరిసిన్‌ బి ఇంజక్షన్‌ తయారీ ఎంతో సంక్లిష్ట ప్రక్రియ. ఈ ఔషధ ఏపీఐతో పాటు ఇంజెక్టబుల్‌ తయారీ యూనిట్‌ ఉండాలి. అందువల్ల కొన్ని కంపెనీలు మాత్రమే ఈ మందును తయారు చేయగలవని చెబుతున్నారు.

ఇదీ చదవండి :టీకా 'సంపద'- కొత్తగా 9మంది బిలియనీర్లు

ABOUT THE AUTHOR

...view details