రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే బారులు తీరారు. కానీ కొన్ని గ్రామాలు ఎన్నికలను బహిష్కరించాయి. ఇన్నాళ్లు తమ సమస్యలను పట్టించుకోని నేతలకు ఇప్పుడెందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. మరికొన్ని చోట్ల ఇతర కారణాలతో పోలింగ్‌కు హాజరు కాలేదు.
విషాదం నుంచి తేరుకోని తీలేరు
నారాయణపేట జిల్లా తీలేరు గ్రామస్థులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. బుధవారం రోజు 10 మంది కూలీలు మరణించిన ఘటన నుంచి వారు ఇంకా తేరుకోలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి ఆసక్తి చూపలేదు.
ఉమ్మడి పాలమూరులో..
మహబూబ్‌నగర్ జిల్లా ఉదండాపూర్లోనూ జలాశయ నిర్వాసితులను పట్టించుకోలేదని పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. అదే జిల్లాలోని బూరెడ్డిపల్లిలో తమ గ్రామాన్ని బాదేపల్లి మున్సిపాలిటీలో కలపడాన్ని నిరసిస్తూ.. ఓటింగ్‌ను అడ్డుకున్నారు. ఆమనగల్ మండలంలోని ఆకుతోటపల్లి గ్రామాన్ని పంచాయతీగా గుర్తించనందుకు నిరసనగా ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. వడ్డేపల్లి జక్కిరెడ్డిపల్లి గ్రామంలో ఓట్లు గల్లంతయ్యాయని గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. ఓట్ల లెక్క తేలే వరకు పోలింగ్ జరగనివ్వమని అడ్డుకున్నారు.
ఉపాధి హామీ దూరమైందని...
తమ గ్రామ సమస్యలు పరిష్కరించేంత వరకు ఓట్లు వేయమని మెదక్ జిల్లా పెద్దాపూర్ వాసులు నిరసన చేపట్టారు. మెదక్ మున్సిపాలిటీలో తమ గ్రామాన్ని కలపడం వల్ల ఉపాధి హామీ పనులు కోల్పోతున్నామని నిరసిస్తూ.. ఎన్నికలను బహిష్కరించారు హౌస్పల్లి వాసులు. ఖమ్మం జిల్లా దేవునితండాలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్లను తొలగించమని అనేకసార్లు రాజకీయ నాయకులకు విన్నపం చేసినా వారు పట్టించుకోలేదని పోలింగ్ కేంద్రానికి రాలేదు. గ్రామ పంచాయతీగా ఉన్న తమ పల్లెను మున్సిపాలిటీలో కలపడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని డీసీ తండా ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు.
మున్సిపాలిటీలో విలీనం నచ్చక...
తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ... నిజామాబాద్ జిల్లా చెక్కి క్యాంప్ వాసులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. రెవెన్యూ అధికారులు భూ సమస్యలు పరిష్కరించడం లేదని ములుగు జిల్లా వడగూడెం ప్రజలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. మంచినీటి సమస్యను తీర్చే వరకు ఓట్లు వేయమని తేల్చి చెప్పారు వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని లక్ష్మీనగర్ తండా వాసులు.
గిరిజనుల కోపం.. పోలింగ్‌కు దూరం..
పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని గిరిజనులు పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అయ్యోరుపల్లి గ్రామ వాసులు కూడా ఓటేయలేదు. తమ ఊరిని వేములవాడ పురపాలక సంఘంలో కలపడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇవన్నీ ఒకఎత్తైతే.. ఖమ్మం జిల్లాలోని ఎదురుగడ్డ వాసులది విచిత్ర పరిస్థితి. తమకు డబ్బులిస్తే గాని ఓటు వేయమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొందరికే నగదు ఇచ్చారని, అందరికీ ఇస్తేనే ఓటు వేస్తామని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: ఓటేసిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్