తెలంగాణ

telangana

ETV Bharat / briefs

నెలకు మనం తినే ప్లాస్టిక్‌ ఎంతో తెలుసా? - ప్రజల దైనందిన జీవితంలో ప్లాస్టిక్ భాగమైపోయింది

ప్రజల దైనందిన జీవితంలో ప్లాస్టిక్ భాగమైపోయింది. ఉదయం లేచిన దగ్గరి నుంచి పడుకునేంత వరకు ఏ పని చేసినా అందులో ప్లాస్టిక్ ఉంటోంది. అందుకే తెలియకుండానే ప్లాస్టిక్‌ను తినేస్తున్నాం. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నమ్మలేని నిజం. రేణువుల రూపంలో ఈ ప్లాస్టిక్ మన పొట్టలోకి చేరిపోతోంది. ఎంత... ఎందుకు అంటే మాత్రం భయం కలుగకమానదు.

నెలకు పావు కిలో ప్లాస్టిక్‌ తినేస్తున్నాం...

By

Published : Jun 27, 2019, 5:18 PM IST

నెలకు మనం తినే ప్లాస్టిక్‌ ఎంతో తెలుసా?

ఆహారంలో ప్లాస్టిక్ చేరిందంటే నమ్ముతారా..? కొంత ప్లాస్టిక్ రోజూ తింటున్నారంటే అంగీకరించగలరా..? ఇదంతా నిజమే... వారానికి 5 గ్రాములు... అంటే ఓ క్రెడిట్‌ కార్డు బరువంత ప్లాస్టిక్ తినేస్తున్నామని ఆస్ట్రేలియాలోని న్యూక్యాజిల్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చారు. నెలకు దాదాపు పావుకిలో శరీరంలోకి ప్రవేశిస్తోందని చెబుతున్నారీ శాస్త్రవేత్తలు. ప్లాస్టిక్ సీసాల్లోని నీరు తాగటమూ ఓ కారణమైతే... ధూళి కణాల ద్వారానూ శరీరంలోకి వెళుతున్నాయి. దాదాపు 52 అధ్యయనాలు సమీక్షించి కొత్త నివేదిక తయారు చేశారు.

ప్లాస్టిక్‌ ఉత్పత్తి 2దశాబ్దాలుగా అనూహ్యంగా పెరిగింది. 20 ఏళ్లలో ఉత్పత్తి చేసిన ప్లాస్టిక్‌- మానవ జాతి చరిత్ర మొత్తంలో తయారైన ప్లాస్టిక్‌తో సమానం. ప్లాస్టిక్‌ పరిశ్రమ 2025 దాకా ఏటా 4శాతం మేర వృద్ధి చెందుతుందని గ్రాండ్‌ వ్యూ రీసెర్చ్‌ నివేదిక తేల్చింది. ప్రపంచంలో తయారయ్యే ప్లాస్టిక్‌లో మూడోవంతు ప్రకృతిని కలుషితం చేస్తోంది. ఏటా 80 లక్షల టన్నులకుపైగా సముద్రాల్లో కలుస్తోంది. ఇది జల చరాలకు ప్రాణసంకటంగా మారుతోంది. ఆ జలచరాలు తిన్న మనిషికి ప్రమాదం పొంచి ఉంది.

గాలి, నీరు, ఆహారం...ఇలా ఏదో మాధ్యమం ద్వారా శరీరంలోకి వెళ్లిన ప్లాస్టిక్‌ దేహానికి ఎంత వరకు హాని చేస్తున్నాయనే అంశంపై లోతైన పరిశోధనల్లేకపోయిన భిన్నవాదనలు, సిద్ధాంతాలు మాత్రం వ్యాప్తిలో ఉన్నాయి. 150 మైక్రాన్ల కన్నా పెద్దవైన ప్లాస్టిక్‌ రేణువులు జీర్ణం కాకుండా, రసాయనాల్ని విడుదల చేయకుండా శరీరం నుంచి బయటికి వచ్చేస్తాయి. అంతకన్నా చిన్న వాటితోనే ప్రమాదం. సూక్ష్మమైన ప్లాస్టిక్‌ రేణువులు జీర్ణక్రియ సమయంలో విషతుల్య రసాయనాలు విడుదల చేసి... పేగుల గోడల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది.

సూక్ష్మ ప్లాస్టిక్‌...చేపల మెదళ్లకి చేరిపోయి.. వాటి ప్రవర్తన మార్చేసిన రుజువులూ ఉన్నాయి. మనిషి మెదడు కణజాలంలోకి చొచ్చుకెళ్తాయా? అన్నది తేలలేదు. సముద్రాలు, నీటి వనరుల్లో చేరిన చిన్న చిన్న ప్లాస్టిక్‌ ముక్కల్ని చేపలు తినేస్తున్నాయి. అలాంటి కలుషిత చేపల్ని తిన్న మనిషీ ప్లాస్టిక్‌ ముప్పు బారిన పడుతున్నాడు. పీల్చే గాలి, ఇంట్లో పేరుకుపోయే దుమ్ము ద్వారా ప్లాస్టిక్‌ రేణువులు శరీరంలోకి వెళ్తున్నాయి. 20 నిమిషాలు భోజనం చేస్తే కనీసం 114 ప్లాస్టిక్‌ రేణువులు ప్లేటులో పడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏటా ఇవి 13 వేల నుంచి 68 వేల వరకు ఉండొచ్చని అంచనా. జల వనరుల్లో ప్లాస్టిక్‌ పోగై తాగునీటి ద్వారా శరీరంలోకి ప్లాస్టిక్ ప్రవేశిస్తోంది. ముఖ్యంగా ప్లాస్టిక్‌ సీసా నీళ్లలో ఈ రేణువులు ఉంటున్నాయి.

దాదాపు 28శాతం ప్లాస్టిక్‌ రేణువులు టైర్ల ద్వారా వస్తున్నాయి. రోడ్లపై నుంచే వరద నీరు...నీటివనరుల్లో కలుస్తోంది. ఆ జలం తాగిన శరీరంలోకి ప్లాస్టిక్‌ వెళ్తోంది. పాలిమర్‌తో తయారయ్యే పాలిస్టర్‌ జాకెట్ల ద్వారా రేణువులు ఎక్కువగా వస్తున్నాయి. ఈ జాకెట్లు ఉతికిన ప్రతిసారీ దాదాపు 1900 రేణువులు విడుదలవుతున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. సముద్రపు ఉప్పు వినియోగించినపుడు మైక్రోప్లాస్టిక్‌ శరీరంలోకి ప్రవేశిస్తోంది. ఇప్పుడీ రేణువులే...మనుషుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నాయి.

తయారీరంగం, పరిశ్రమలు, 3డీ ప్రింటింగ్‌లో మైక్రోప్లాస్టిక్స్‌ ఎక్కువగా వాడతారు. అన్ని రకాల ప్లాస్టిక్‌లూ చివరికి 75శాతానికిపైగా వ్యర్థాలుగా మిగులుతున్నాయి. ఇందులో మూడోవంతు అంటే దాదాపు 10 కోట్ల టన్నుల్ని ప్రకృతిలో కలిపేస్తున్నారు. ఏటా కనీసం 24 లక్షల టన్నులు సముద్రంలో కలుస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే...2025 నాటికి సముద్రాల్లో ప్రతి 3టన్నుల చేపలకు ఒక టన్ను ప్లాస్టిక్‌ ఉంటుంది.

ప్లాస్టిక్‌ ముప్పు నుంచి తప్పించుకునేదెలా అన్నదే సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న. ఒక్కసారే పనికొచ్చే ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగ్‌లు, ప్లాస్టిక్‌ సీసాలు పునర్వినియోగం ఉండే మందమైన వాటిని వినియోగించాలి. ఇళ్లలో దుమ్ము లేకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు శుద్ధిచేసిన ఉప్పునే వాడాలి. కలుషిత నీరు తాగకుండా ఉంటే...శరీరంలోకి ప్లాస్టిక్ రేణువులు ప్రవేశించే ముప్పు నుంచి బయటపడొచ్చు.

ఇవీ చూడండి:పిల్లలు పుట్టకుండా కోతులకు ఆపరేషన్లు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details