టీవీ9 పేరుతో తెలుగు, మరాఠీ, కన్నడ, గుజరాతీ, ఇంగ్లీషు, హిందీ ఛానళ్లు నిర్వహిస్తున్న అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీఎల్)ను వ్యాపారవేత్త శ్రీనిరాజుకు చెందిన చింతలపాటి హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐల్యాబ్స్ వెంచర్ కేపిటల్ ఫండ్ కలిపి ప్రారంభించాయి. ఏబీసీఎల్ కంపెనీలో ఈ రెండు సంస్థలకు 90 శాతానికి పైగా వాటా ఉంది. సీఈవో, డైరెక్టర్‌గా ఉన్న రవిప్రకాశ్, ఆయన అనుచరులకు 8 శాతానికి పైగా భాగస్వామ్యం ఉంది.
90శాతం పైగా వాటా కొనుగోలు చేసిన అలందా మీడియా
90 శాతానికి పైగా వాటా ఉన్న రెండు సంస్థల వాటాను... హైదరాబాద్‌కు చెందిన అలందా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్...గత ఏడాది ఆగస్టు 25న కొనుగోలు చేసింది. డి-మ్యాట్ రూపంలో షేర్ల బదిలీ జరిగింది. ఈ లావాదేవీని గుర్తించాలని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు ఏబీసీఎల్ లేఖ రాసింది.
డైరెక్టర్ల మార్పు విషయమై విభేదాలు
యాజమాన్యం చేతులు మారిన తర్వాత కొత్త డైరెక్టర్ల నియామకంపై అలందా మీడియా దృష్టిపెట్టింది. నలుగురు డైరెక్టర్లను నియమించేందుకు బోర్డు మీటింగ్‌లో తీర్మానం చేసి కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు పంపించింది. ఈ తీర్మానాల మీద ఒకసారి వి.రవిప్రకాశ్, మరోసారి ఎం.కె.వి.ఎన్.మూర్తి డైరెక్టర్ల హోదాలో సంతకాలు చేశారు. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ మార్చి 29న అనుమతి మంజూరు చేసింది.
ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించారని ఆరోపణ
అలందా మీడియాకు చెందిన నలుగురు డైరెక్టర్లు తమ నియామక పత్రాలను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో దాఖలు చేయాలని కంపెనీ సెక్రటరీని కోరారు. రవిప్రకాశ్, ఆయన సహచరులు కొందరు ఈ ప్రక్రియను అడ్డుకునే ఉద్దేశంతో కంపెనీ సెక్రటరీ రాజీనామా చేసినట్లు పాతతేదీతో ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించారని అలందా యాజమాన్యం ఆరోపిస్తోంది. ఇదే విషయాన్ని కంపెనీ సెక్రటరీ రాతపూర్వకంగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు ఫిర్యాదు చేశారు.
రవిప్రకాశ్‌ను సీఈవోగా తొలగిస్తూ ఆదేశాలు
ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ అధికారులు ఏబీసీఎల్లో కొత్త డైరెక్టర్ల నియామక ప్రక్రియను ఆమోదించారు. ఈ వ్యవహారంలో రవిప్రకాశ్ ఫోర్జరీ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ...సీఈఓ పదవి నుంచి తొలగిస్తున్నట్టు అలందా మీడియా ప్రకటించింది. సంస్థకు హాని కలిగించే దురుద్దేశంతో, సినీ నటుడు శివాజీతో కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టించి...నిర్వహణలో ఇబ్బందులు కల్పిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుట్రలో భాగంగా సంస్థకు చెందిన ముఖ్య సమాచారం తస్కరించి బయటి వ్యక్తులకు చేరవేశారని అనుమానం వ్యక్తం చేసింది.
ఈ వ్యవహారంపై సినీనటుడు శివాజీ గతనెల 19నే హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఏబీసీఎల్లో రవిప్రకాశ్‌కున్న 20 లక్షల షేర్లలో 40 వేలు కొనుగోలు చేసేందుకు 20 లక్షల రూపాయలు చెల్లించి ఫిబ్రవరి 20, 2018న ఒప్పందం కుదుర్చుకున్నానని అఫిడవిట్ సమర్పించారు. ఒప్పందం జరిగిన ఏడాదిలోగా షేర్లు బదిలీ చేసేందుకు రవిప్రకాశ్ అంగీకరించారని పేర్కొన్నారు. అయితే....ఏబీసీఎల్లో మార్పులకు సంబంధించి రవిప్రకాశ్ కొన్ని నిజాలు దాచి...మోసపూరితంగా వ్యవహరించారని శివాజీ ఆరోపించారు. ఎన్నోసార్లు గుర్తు చేసినా ఏదో ఒక సాకు చూపుతూ షేర్ల బదిలీ చేయలేదని...విసిగిపోయి ఫిబ్రవరి 15న స్వయంగా నోటీసు ఇచ్చానని అఫిడవిట్‌లో తెలిపారు. రవి ప్రకాశ్ ఫిబ్రవరి 17న స్పందిస్తూ షేర్ల బదిలీలో జాప్యానికి ఎన్సీఎల్టీ జారీ చేసిన ఓ మధ్యంతర ఉత్తర్వు కారణమని...ఈ వివాదం పరిష్కారమైన తర్వాత చేస్తానని సమాధానం ఇచ్చారు.
రవిప్రకాశ్, శివాజీల మధ్య 2018 ఫిబ్రవరిలో జరిగినట్లుగా చెబుతున్న షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ కేవలం తెల్ల కాగితాలపై ఉందని తేల్చారు. ఇలాంటి అనుమానాస్పద చర్యల వల్లే, శివాజీ, రవిప్రకాశ్ మధ్య కుదిరినట్లు చెబుతున్నది ఫోర్జరీ ఒప్పందంగా టీవీ9 కొత్త యాజమాన్యం ఫిర్యాదులో పేర్కొంది. శివాజీకి వ్యక్తిగత హోదాలో తన వద్ద ఉన్న షేర్లు అమ్మేందుకు అంగీకరించిన రవిప్రకాశ్...ఈ ఉత్తర్వులను సాకుగా చూపించి షేర్ల బదిలీని నిలిపివేయడం వెనుక ఆంతర్యం ఏంటని నూతన యాజమాన్యం ప్రశ్నిస్తోంది. గత ఏడాది ఆగస్టులో జరిగిన లావాదేవీ ద్వారా టీవీ9..తన చేతుల్లోంచి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేని రవిప్రకాశ్ ఈ కుట్రకు తెరలేపారన్నది కొత్త యాజమాన్యం వాదన.